పెరుగుతున్న పాజిటివ్ కేసులపై సీఎం కేసీఆర్ పెదవి విప్పటం లేదెందుకు?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Jun 2020 6:14 AM GMT
పెరుగుతున్న పాజిటివ్ కేసులపై సీఎం కేసీఆర్ పెదవి విప్పటం లేదెందుకు?

మహమ్మారి మన దగ్గరకు వచ్చేసిన వేళ.. తరచూ మీడియా సమావేశాల్ని నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. గడిచిన కొద్దిరోజులుగా ప్రెస్ మీట్ ను నిర్వహించకపోవటం తెలిసిందే. ఆ మధ్య వరకు రోజువారీగా యాభై కంటే తక్కువగా.. ఆ తర్వాత అరవై డెబ్భై పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యేవి. ఇటీవల కాలంలో వందకు తగ్గకుండా నిత్యం కేసులు నమోదు కావటం.. మరణాలు సైతం పెరుగుతున్న వైనం ఇప్పుడు అందరిని ఆందోళనకు గురి చేస్తోంది.

దేశంలోని పలు రాష్ట్రాల కంటే తక్కువ కేసులు.. మరణాల నమోదులోనూ చాలా వెనుకున్న తెలంగాణ రాష్ట్రం ఇటీవల మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్న పరిస్థితి. దీనికి తోడు లాక్ డౌన్ ఎత్తేయటం.. అన్ లాక్ 1.0 పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చేయటంతో పలువురికి కొత్త ఆందోళన మొదలైంది. అంతకంతకూ పెరుగుతున్న కేసుల నేపథ్యంలో.. రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందన్న ఆలోచనే భయంగా మారింది.

ఇలాంటి వేళ.. తన మాటలతో ధైర్యం చెప్పి.. ప్రజల్లో స్థైర్యాన్ని పెంచాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రజలకు అందుబాటులోకి రాకపోవటం చర్చగా మారింది. గతంలో తరచూ ప్రజల ముందుకు వచ్చి.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చెప్పి.. మాయదారి రోగం గురించి భయపడకండి.. మేం మీకు అండగా ఉన్నామన్న మాటల్ని చెప్పేవారు. కానీ.. ఇప్పుడు అలాంటిదేమీ చేయని పరిస్థితి.

పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న వేళ.. తీసుకుంటున్నచర్యలు ఏమిటన్నది చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ.. అలాంటిదేమీ లేకుండా.. ఫాంహౌస్ లో పలువురు రైతులతోనూ.. తాను కలవాలనుకున్న వారితో భేటీలు నిర్వహించటం.. అప్పుడప్పుడు ప్రగతి భవన్ కు వచ్చి సమీక్షలు నిర్వహిస్తున్న తీరుపై అధికార పార్టీ నేతల మధ్య చర్చగా మారటం గమనార్హం.

Next Story
Share it