బాలుడికి సద్బుద్ధులు నేర్పాల్సిన అంగన్‌వాడీ టీచర్ సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించింది. మూడేళ్ల బాలుడు తరచు ప్యాంట్‌లో మూత్ర విసర్జన చేస్తున్నాడని.. కోపంతో అతని ప్రైవేట్ పార్ట్స్‌ని కాల్చి వాత పెట్టింది. కర్నాటకలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 28 ఏళ్ల అంగన్‌వాడీ టీచర్ రష్మీ బాలుడి ప్రైవేట్ భాగాలను కాల్చడానికి వెలిగించిన అగ్గిపుల్లలను ఉపయోగించినట్లు తెలిసింది. తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి తాలూకాలోని గోడెకెరె గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన సోమవారం చిన్నారికి బామ్మ స్నానం చేయిస్తుండగా వెలుగు చూసింది. చిన్నారి జననాంగాలపై, కుడి ఒడిలో కాలిన గాయాలను గమనించింది.
కుటుంబీకులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారి ద్వారా సోమవారం జిల్లా బాలల సంరక్షణ అధికారి పవిత్రకు సమాచారం చేరింది. బాలుడి ఇంటికి చైల్డ్ కౌన్సెలర్‌ను పంపి వివరాలను సేకరించారు. స్థానిక ప్రజారోగ్య కేంద్రంలో చికిత్స అనంతరం.. దళిత 'కొరమ' సామాజిక వర్గానికి చెందిన బాలుడు కోలుకుంటున్నాడు. ఇటీవలే గర్భాశయ క్యాన్సర్‌తో బాలుడు తన తల్లిని కోల్పోయాడు. అతడిని తండ్రి, అమ్మమ్మ చూసుకునేవారు. బాలుడికి 6వ తరగతి చదువుతున్న ఒక పెద్ద తోబుట్టువు ఉన్నారు.
చిన్నారి తల్లిదండ్రులు కొన్నాళ్లుగా చిక్కమగళూరులోని కాఫీ ఎస్టేట్‌లో పనిచేశారు. తల్లి చనిపోవడంతో గొడెకెరెకు వెళ్లారు. అంగన్‌వాడీ బడిలో పిల్లవాడు తన ప్యాంటును తరచుగా మూత్ర విసర్జనతో తడిచేవాడు. ఇది చిన్న పిల్లలలో చాలా సాధారణం. నిందితురాలు రష్మీపై ఎటువంటి పోలీసు కేసు నమోదు కాలేదు. తాలూకా చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సిఫారసుల మేరకు ఆమెను సర్వీసు నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీధర్ ఎంఎస్ తెలిపారు.