ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ రాధిక గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకున్నారు. సామాజిక కార్యకర్త డా.ఆర్.జె.రామనారాయణన్.. చెన్నైలో ఏఎంఎన్ ఫైన్ ఆర్ట్స్ తరపున కళలపై అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. డ్యాన్స్ మాస్టర్ ఐ.రాధిక ఆధ్వర్యంలో జరిగిన ఈ డ్యాన్స్ షోలో నృత్య కళపై అవగాహన కల్పిస్తూ గిన్నిస్ రికార్డు సృష్టించారు. చెన్నైలోని పలు వేదికలపై, అలాగే ఆన్‌లైన్ ద్వారా రోజూ గంట చొప్పున సంవత్సరం పాటు.. డ్యాన్స్ మాస్టర్ రాధిక బృందం నేతృత్వంలో నాట్యకళ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాట్య కళాకారులు పాల్గొన్నారు.
తమిళనాడు నృత్య కళల సాంస్కృతిక విలువను కాపాడేందుకు, యువ తరానికి ఈ కళలపై అవగాహన కల్పించేందుకు డ్యాన్స్ మాస్టర్ ఐ. రాధిక ఆధ్వర్యంలో ఏఎమ్‌ఎన్ ఫైన్ ఆర్ట్స్ తరపున డాక్టర్ ఆర్జే రామనారాయణన్ ప్రతిరోజూ నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. తమిళ చిత్రసీమలో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్‌గా వెలుగొందుతున్న ఐ.రాధిక మరియు ఆమె బృందం సహకారంతో చెన్నైలో వివిధ వేదికలపై మరియు ఆన్‌లైన్‌లో 365 రోజుల పాటు ఒక గంట డ్యాన్స్ ఫెస్టివల్ జరిగింది.
కాగా చివరి రోజున 600 మంది డ్యాన్సర్లు పాల్గొని ముగింపు వేడుకను నిర్వహించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ డ్యాన్స్ కాంపిటీషన్ లో అత్యధిక మంది పాల్గొని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు. న్యాయమూర్తుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. దీన్ని గిన్నిస్ రికార్డ్ బుక్ నిర్వాహకులు ఆన్‌లైన్ ద్వారా తిలకించారు. పాండిచ్చేరి ముఖ్యమంత్రి రంగసామి..డ్యాన్స్ బృందాన్ని ప్రశంసిస్తూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ అందించారు. డ్యాన్స్ మాస్టర్ ఐ.రాధిక తన సహాయకులు ఎల్.ఆర్.చక్రవర్తి, పి.వెంకటేష్‌లకు సర్టిఫికెట్ అందజేశారు.