కొత్త వన్డే లీగ్‌కు ఆదిలోనే అడ్డంకి
By తోట వంశీ కుమార్ Published on 21 April 2020 12:32 PM GMTకరోనా వైరస్ ధాటికి క్రీడా రంగం కుదేలైంది. ఈ మహమ్మారి వ్యాప్తిని నియంత్రించడానికి చాలా దేశాలు లాక్‌డౌన్ ను విధించాయి. ఈ మహమ్మారి ముప్పుతో ఇప్పటికే చాలా టోర్నీలు రద్దు కాగా.. పలు టోర్నీలు వాయిదా పడ్డాయి. దీంతో క్రీడాకారులంతా ఇళ్లకే పరిమితం అయ్యారు.
తాజాగా శ్రీలంకలో తమ పర్యటనను వాయిదా వేస్తున్నామని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించింది. షెడ్యూలు ప్రకారం జూన్‌లో శ్రీలంకతో సపారీ సేన మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. ఈ వన్డే సిరీస్‌తోనే ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) కొత్త వన్డే లీగ్‌ను ఆరంభించనుంది. మార్చి 2022 వరకు ఐసీసీ నిర్వహించనున్న ఈ వన్డే లీగ్ ఆధారంగా 2023 ప్రపంచకప్ జట్లను ఎంపిక చేస్తారు.
ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీలంక సిరీస్‌కు సన్నద్దమవ్వడానికి అవకాశం లేదు. మా ఆటగాళ్ల ఆరోగ్యం అన్నింటి కన్నా ముఖ్యం. కరోనా విజృంభిస్తున్న కారణంగా సిరీస్‌ను వాయిదా వేయడం తప్పలేదు. ఐసీసీ కొత్త వన్డే లీగ్ లో తొలి సిరీస్ ఇలా వాయిదా పడం బాధగా ఉంది. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాక.. శ్రీలంక పర్యటన షెడ్యూల్ ను ఖరారు చేస్తాం అని దక్షిణాప్రికా క్రికెట్ బోర్డు కార్యనిర్వాహణ అధికారి డా. జాక్వస్ తెలిపారు. ఇటీవల స్వదేశంలో ఆసీస్‌పై తమ ఆటగాళ్లు చక్కని ప్రదర్శన చేశారన్న ఆయన.. అదే ఫామ్‌ను
ఆటగాళ్లు కొనసాగిస్తారని బావిస్తున్నానని, అయితే.. ప్రస్తుత పరిస్థితులు నిరాశకు గురిచేస్తున్నాయని తెలిపారు.