ఆయన నాయకత్వమే ఎంతో స్పెషల్..!
By తోట వంశీ కుమార్ Published on 8 July 2020 12:01 PM ISTభారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పుట్టినరోజు నేడు. ఎంతో మంది ప్రముఖులు సౌరవ్ గంగూలీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. సౌరవ్ గంగూలీ భారత క్రికెట్ జట్టుకు చేసిన కృషిని పలువురు కొనియాడారు. అతడి దూకుడైన స్వభావమే విదేశాల్లో భారత్ కు విజయాలను అందించింది. ఆటగాడిగా కూడా ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ గంగూలీ ఆడాడు. 'గాడ్ ఆఫ్ ఆఫ్-సైడ్' అని పిలిచేవారంటే అతడి బ్యాటింగ్ ఎంత స్పెషల్ గా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. భారత క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించాడు గంగూలీ.
దాదాగా పిలిపించుకునే సౌరవ్ గంగూలీ 1996 లో టెస్ట్ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. ఇంగ్లాండ్ తో లార్డ్స్ లో జరిగిన మ్యాచ్ లో తన మొదటి మ్యాచ్ లోనే సెంచరీ బాది వార్తల్లో నిలిచాడు. ఆ తర్వాత వన్డేల్లో కూడా అడుగుపెట్టాడు గంగూలీ 1997లో వరుసగా నాలుగు వన్డేల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. 1999 క్రికెట్ వరల్డ్ కప్ లో గంగూలీ 183 పరుగులు చేశాడు.. రాహుల్ ద్రావిడ్ తో కలిసి 318 పరుగుల భారీ పార్ట్నర్ షిప్ ను నమోదు చేశాడు.
2000 సంవత్సరంలో భారత క్రికెట్ జట్టును మ్యాచ్-ఫిక్సింగ్ కుంభకోణం చుట్టుముట్టినప్పుడు గంగూలీని కెప్టెన్ గా నియమించారు. దాదా కెప్టెన్ అయ్యాక భారత జట్టులోకి యంగ్ ట్యాలెంట్ ను తీసుకుని వచ్చాడు. యువరాజ్ సింగ్, మొహమ్మద్ కైఫ్, ఎం.ఎస్.ధోని, ఆశిష్ నెహ్రా, జహీర్ ఖాన్ లాంటి యంగ్ ఆటగాళ్లను గంగూలీ భారతజట్టులోకి తీసుకున్నాడు. 2000 సంవత్సరంలో ఐసీసీ నాకౌట్ ట్రోఫీలో ఫైనల్ కు తీసుకుని వెళ్ళాడు. 2001 లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాను 2-1 తో భారత్ చిత్తు చేసింది. ఈ సిరీస్ లో భారత జట్టు ఈడెన్ గార్డెన్స్ లో చిరస్మరణీయమైన టెస్ట్ విజయాన్ని అందుకుంది. వివిఎస్ లక్ష్మణ్-రాహుల్ ద్రావిడ్ భారత్ కు అద్భుతమైన విజయాన్ని అందించారు.
ఇక గంగూలీ 2002 నాట్ వెస్ట్ ట్రోఫీ సమయంలో షర్ట్ విప్పి గాల్లోకి తిప్పిన ఘటనను ఎవరూ మరచిపోరు. యువరాజ్ సింగ్, మొహమ్మద్ కైఫ్ భారత్ కు విజయాన్ని అందించడంతో ఎప్పుడూ లేని విధంగా గంగూలీ టీ షర్ట్ విప్పి మరీ విజయాన్ని ఎంజాయ్ చేశాడు. 2003 వరల్డ్ కప్ లో భారత్ ను ఫైనల్ దాకా చేర్చాడు గంగూలీ.
2004 లో భారత జట్టు పాకిస్థాన్ గడ్డ మీద మొదటి టెస్టు సిరీస్ ను అందుకుంది. ఇక గ్రెగ్ ఛాపెల్ భారత జట్టుకు కోచ్ అయిన తర్వాత గంగూలీని కావాలనే జట్టు నుండి తొలగించాలని చూశాడు. అనుకున్నట్లుగానే పక్కన పెట్టాడు కూడానూ..! కానీ దాదా తిరిగి జట్టు లోకి వచ్చాడు. 2008 లో ఆస్ట్రేలియాతో నాగ్ పూర్ లో టెస్టు మ్యాచ్ ఆడిన గంగూలీ ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత కొద్దిరోజుల పాటూ ఐపీఎల్ లో అలరించిన దాదా 2012లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ కు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు.
దాదా తన కెరీర్ లో 113 టెస్టులు, 311 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 7212 పరుగులు చేయగా, వన్డేల్లో 11363 పరుగులు చేశాడు. గంగూలీ ఫ్రంట్ ఫుట్ వచ్చి సిక్స్ బాదే స్టైల్ క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మరచిపోరు. గంగూలీ అందించిన అద్భుతమైన విజయాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
గంగూలీ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టాడు. గత ఏడాది అక్టోబర్ లో బిసిసిఐ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు. త్వరలో ఐసీసీ బాధ్యతలు కూడా చేపట్టే అవకాశం ఉందని భావిస్తూ ఉన్నారు.