హెయిర్ కట్ చేయించుకోమని ఆకాష్ చోప్రా చెప్పగా.. ధోని ఏమని సమాధానం ఇచ్చాడంటే..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 July 2020 2:35 PM GMT
హెయిర్ కట్ చేయించుకోమని ఆకాష్ చోప్రా చెప్పగా.. ధోని ఏమని సమాధానం ఇచ్చాడంటే..?

మహేంద్ర సింగ్ ధోనీ పుట్టినరోజు కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఉన్నారు. ధోని కెరీర్ మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకూ చోటుచేసుకున్న ఎన్నో విషయాలను పలువురు ప్రముఖులు పంచుకుంటూ ఉన్నారు. ధోని క్రికెట్ లోకి అడుగుపెట్టినప్పుడు జులపాల జుట్టుతో కనిపించిన సంగతి తెలిసిందే. పలువురు అభిమానులు ధోనీ స్టైల్ ను ఫాలో అయ్యారు. ఒకప్పుడు ధోని లాంగ్ హెయిర్ ను కట్ చేయించుకోమని భారత జట్టు మాజీ ఓపెనర్, కామెంట్రేటర్ ఆకాష్ చోప్రా సూచించాడట. 2004 లో ఇద్దరూ డ్రెస్సింగ్ రూమ్ ను షేర్ చేసుకున్నప్పుడు తమ మధ్య చోటుచేసుకున్న ఘటనలను ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు.

నేను నా క్రికెట్ కెరీర్ లో ఎంతో మంది క్రికెటర్లను చూశాను. రెండు దశాబ్దాల కెరీర్ లో కొందరిని దగ్గర నుండి గమనించాను. కొందరు క్రికెట్ మీద ప్రేమతో కెరీర్ మొదలుపెడితే, మరికొందరు పేరు ప్రఖ్యాతల కోసం ఆడుతూ ఉంటారు. కొందరు సక్సెస్ అనే మెట్లను ఎక్కితే, మరికొందరు కేవలం తమ కాలర్లను ఎగరేస్తూ ఉంటారు. కొందరికి క్రికెట్ అంటే ఎంతో పిచ్చి.. కొందరేమో ఫ్యాషన్ వెంట పడుతూ ఉంటారు. కానీ మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం చాలా ప్రత్యేకం.

మొదట్లో మహిని చూసినప్పుడు గోల్డెన్ హెయిర్ తో, ముఖానికి సన్ స్క్రీన్, బ్రాండెడ్ గాగుల్స్ ఉంటాయి.. ఇది క్రికెట్ గ్రౌండ్, బాలీవుడ్ సెట్ కాదు అని చెప్పాల్సి ఉంటుంది. కానీ అతడిని దగ్గర నుండి చూస్తే కానీ అర్థం అవ్వదు. తన రూమ్ మేట్ గా మహేంద్ర సింగ్ ధోనీ 2004 లో జింబాబ్వే టూర్ కు వెళ్ళినప్పుడు ఉన్నాడని.. అతడి నడవడికను చూసి తాను చాలా ఆశ్చర్య పోయానని తెలిపాడు.

2004 లో ఇండియా A టూర్ లో భాగంగా జింబాబ్వే, కెన్యాకు వెళ్ళాం.. టెస్ట్ ఓపెనర్ అయిన నేను ధోనీతో రూమ్ షేర్ చేసుకున్నానని ఆకాష్ చోప్రా తెలిపాడు. తాను తినడానికి ఏదైనా ఆర్డర్ ఇద్దామా అని అడిగినప్పుడు.. నీకు ఏది ఇష్టం ఉంటే అది ఆర్డర్ ఇవ్వు.. కలసి తిందాం అని చెప్పాడు.. ఇక నిద్ర పోయే సమయంలో కూడా ఎప్పుడు నిద్రపోవాలి అనుకుంటే అప్పుడు లైట్స్ ఆఫ్ చేయండి నాకు ఎటువంటి ఇబ్బంది లేదని ధోని చెప్పాడని ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు. మొదట ధోనీని చూసినప్పుడు మనసులో అనిపించింది వేరు.. ధోనిని దగ్గర నుండి చూశాక తెలుసుకుంది వేరు అని ఆకాష్ చోప్రా వెల్లడించాడు. సింప్లిసిటీ ఉన్న చోటే గొప్పతనం ఉంటుందని తనకు అర్థం అయ్యిందని ఆకాష్ చోప్రా తెలిపాడు. సింపుల్ లైఫ్.. హై థింకింగ్ అని ధోని గురించి చెప్పాడు ఆకాష్ చోప్రా.

ధోనిని చూశాక అనిపించేది వేరు.. అతడి గురించి తెలిసుకునేది వేరు అని అన్నాడు. నిన్ను చూస్తే వేరేగా అనిపిస్తుంది.. హెయిర్ కట్ చేయించుకో అని ప్రేమగా చెప్పానని.. హెయిర్ కట్ చేయించుకుంటే అందరూ నిన్ను సీరియస్ గా తీసుకుంటారని చెప్పగా వెంటనే ధోని నుండి సమాధానం ఇలా వచ్చింది 'నేను హెయిర్ కట్ చేయించుకోను.. నా హెయిర్ స్టైల్ చూశాక ప్రజలు కూడా దీన్నే ఫాలో అవుతారు' అని అన్నాడు ధోని. ధోని ఊహించిందే నిజమైంది. అతడి హెయిర్ స్టైల్ ను ఎంతో మంది అభిమానులు ఫాలో అయ్యారు.

పాకిస్థాన్ మాజీ జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ కూడా ధోనీ హెయిర్ స్టైల్ కు ఫిదా అయిన సంగతి తెలిసిందే. నువ్వు ఆ హెయిర్ స్టైల్ ను అలాగే మెయింటైన్ చెయ్, కట్ చేయకు అని కోరాడట. మనిషి వేషధారణ చూసి కాదు, మనిషికి దగ్గరైతే వాళ్ళ గురించి తెలుస్తుందని మహేంద్ర సింగ్ ధోని ఒక ఉదాహరణగా నిలిచాడు.

Next Story