సరికొత్త చరిత్ర లిఖించిన ప్రవీణ్ తాంబే

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 July 2020 8:59 AM GMT
సరికొత్త చరిత్ర లిఖించిన ప్రవీణ్ తాంబే

జూన్ 6, 2020న క్రికెటర్ ప్రవీణ్ తాంబే సరికొత్త రికార్డును సృష్టించాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఆడబోతున్న మొదటి భారతీయుడిగా చరిత్ర లిఖించాడు. రాజస్థాన్ రాయల్స్ మాజీ క్రికెటర్, స్పిన్నర్ అయిన ప్రవీణ్ తాంబేను సిపిఎల్ 2020 వేలంపాటలో ట్రిన్ బాగో నైట్ రైడర్స్ జట్టు సొంతం చేసుకుంది.

ప్రవీణ్ తాంబే ఐపీఎల్ లో ఎంట్రీ ద్వారానే సంచలనం సృష్టించాడనుకోండి. 41 సంవత్సరాల వయసులో ప్రవీణ్ తాంబే ఐపీఎల్ లో మొదటి మ్యాచ్ ఆడాడు. తక్కువ వయసు ఉన్న కుర్రాళ్లను ఫ్రాంచైజీలు తీసుకోవడం చూసిన ఐపీఎల్ ఫ్యాన్స్.. 41 సంవత్సరాల తాంబేను తీసుకోవడం చూసి షాక్ అయ్యారు. ప్రవీణ్ తాంబే తన మొదటి ఐపీఎల్ సీజన్ లో మంచి ప్రదర్శన ఇచ్చాడు. ఆ తర్వాత ప్రవీణ్ తాంబే పెద్దగా రాణించకపోవడంతో ఫ్రాంచైజీలు అతనిపై పెద్దగా నమ్మకం ఉంచలేదు. 2016లో గుజరాత్ లయన్స్ కు ఆడిన ప్రవీణ్ తాంబే, 2017 ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిథ్యం వహించాడు.

ఇప్పుడు కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో ఈ స్పిన్నర్ భాగస్వామ్యం అవ్వడంతో భవిష్యత్తులో ఐపీఎల్ ఆడే అవకాశాలు లేనట్టే అని అంటున్నారు. అందుకు బీసీసీఐ నిబంధనలు అడ్డుపడుతూ ఉంటాయి. అందుకే ఇతర దేశాలలో జరిగే లీగ్ లలో భారత ఆటగాళ్లు ఆడడానికి అవకాశం ఉండదు. ఇక కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడబోతున్న మొదటి భారతీయుడు కావడంతో పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు.

ట్రిన్ బాగో నైట్ రైడర్స్ జట్టుకు యజమాని షారుఖ్ ఖాన్ కావడం విశేషం. ఈ జట్టుకు కాలిన్ మున్రో, డ్వెన్ బ్రావో, కీరన్ పోలార్డ్, సునీల్ నరైన్ లాంటి స్టార్స్ ఉన్నారు. ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఫవాద్ అహ్మద్, కివీస్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌ టిమ్ సీఫర్ట్, జేడెన్ సీల్స్ ను సిపిఎల్ 2020 ఆక్షన్ లో ట్రిన్ బాగో నైట్ రైడర్స్ జట్టు సొంతం చేసుకుంది.

Next Story