సోనూ.. రీచార్జి చేయించవా!!

By మధుసూదనరావు రామదుర్గం  Published on  15 Aug 2020 3:01 PM GMT
సోనూ.. రీచార్జి చేయించవా!!

తాజాగా సోనూసూద్‌ సాయగుణంపై కొందరు నెటిజన్ల స్పందన విస్తుపోయేలా ఉంటోంది. ఒకమ్మాయికి ఏకంగా సోనూ ఇంటర్నెట్‌ స్పీడు దారుణంగా పడిపోయింది. స్పీడు పెంచవా కాస్త.. అంటూ కామెంట్‌ చేసే స్థితికి ఎదిగింది. కరోనా కష్టంతో రోడ్డున పడ్డ బీదాబిక్కి జనాలు బిక్కుబిక్కు మంటుంటే మరి సోనూసూద్‌ తాను చెమటోడ్చి సంపాదించిన పైనల్ని వారికోసం చేతికి ఎముక లేకుండా ఖర్చు చేశాడుగా.. కొందరికి అది అతి అనిపించిందేమో! ఏం చేద్దాం వారి మనస్థితి అలాంటిది అని మరికొందరు నెటిజన్లు అంటున్నారు.

వెనకటికి ఎవరో ఇలాంటి వారే ఓ పెద్దాయనతో తిక్కన ఏంటి తిక్కోడులా.. ఎర్రన్న ఏంటి ఏర్రోడులా అన్నాడట.. దానికాయన నవ్వుతూ అవును మరి మనలాంటి వారి బుర్రకు అందకుండా సంస్కృతంలో ఉండిపోయిన భారతాన్ని సరళ తెలుగులో రాసినోడు తిక్కోడు, ఎర్రోడు కాకపోతే ఏమవుతారు? డామిట్‌ ఇలా తెలుగులో రాయడానికి వారు టైం వేస్ట్‌ చేశారు అన్నా అంటావేమో.. కదూ అంటూ మెత్తగానే చురకలంటించాడట! సోనూపై కామెంట్లు చూస్తుంటే.. ఇలాంటి సందదర్భాలు ఎవరికైనా గుర్తొస్తాయేమో!

ఆ ఇంటర్నెట్‌ సమస్యతో తెగ బాధపడిపోతున్న అమ్మాయి కామెంట్‌కు అంతే దీటుగా సోనూస్పందించాడు.‘ రేపటి దాకా ఓపిక పట్టగలవా ప్లీజ్‌.. ఎందుకంటే ఇంతకన్నా పెద్ద సమస్యలకు నేను స్పందించాల్సి ఉంది. కంప్యూటర్‌ రిపేర్‌ చేయించాలి ఒకరికి. మరొకరికేమో పెళ్ళి కుదుర్చాలి, రైలు టికెట్‌ సమస్య వచ్చి పడింది ఒకరికి.. మరొకరికేమో ఇంట్లో నల్లా నీరు సరిగా రావట్లేదట! ప్రాధాన్య క్రమంలో వీటని పరిష్కరించిన వెంటనే నీ ఇంటర్నెట్‌ స్పీడందుకునేలా చేస్తా సరేనా’ అంటూ మైండ్‌ బ్లాక్‌ అయ్యే సమాధానమిచ్చాడు. అయినా విమర్శించడానికేముంది? అదేమైనా బ్రహ్మవిద్యా.. చేతిలో మొబైల్‌ ఉంది.. మొబైల్‌లో డాటా బ్యాలెన్స్‌ ఉంది. టైమ్‌ పాసై చావడం లేదు. అసలే కరోనాకాలం. ఏదో ఒకటి చేయాలిగా.. అందుకే అలాంటిదే చేస్తున్నారు అని కొందరు అంటున్నారు. సోనూసూద్‌ సాయంపై స్పందిస్తున్న కొందరి విసుర్లు, పంచ్‌లు (అని వారనుకుంటున్నారేమో) చదువుతుంటుంటే.. పోనూ ఇలాంటి ట్రెండ్‌కు కూడా అలవాటు పడాలేమో అనిపిస్తుంది.

నీతి ఏమిటంటే.. ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుందన్న న్యూటన్‌ మూడో సూత్రం అందరూ తెలుసుకోవడం మంచిది.

Next Story
Share it