ఆకలి తెలిసిన అమ్మ..!

By మధుసూదనరావు రామదుర్గం  Published on  26 July 2020 8:48 AM GMT
ఆకలి తెలిసిన అమ్మ..!

‘హలో.. మేడమ్‌ మేం నాల్గు రోజులుగా తినడానికి ఏమీ లేక పస్తులుంటున్నాం. ఏం చేయాలో తెలీడం లేదు. ఎవరూ మా వైపే చూడటం లేదు. మీరే మా బాధ తీర్చాలి..’ పన్నెండేళ్ల ఆర్తి (పేరు మార్చాం) ఫోన్లో ఈ విషయం చెప్పడానికి చాలా శక్తినే కూడదీసుకుంది. నీరసంగా వణుకుతున్న స్వరం.. కాసింత తడబాటు స్పష్టంగా వినిపించింది రుచిరాగుప్తాకు. ఆ ఫోన్‌కాల్‌ ఢిల్లీలోని రెడ్‌లైట్‌ ఏరియా నుంచి వచ్చింది. ఆర్తి అదృష్టం కొద్ది ఆ పోన్‌ను అప్‌నే ఆప్‌ స్వచ్ఛంద నిర్వాహకురాలు రుచిరా గుప్తానే రిసీవ్‌ చేశారు. ఆ చిన్నారి గొంతులో నిస్సహాయత, నీరసం రుచిరా గుప్తా గుండెను కదలించింది. ‘ఇంతకూ మా నుంచి ఏ సాయం కోరుతున్నావో చెప్పమ్మా...’ అంటూ లాలనగా అడిగింది. ఆ తర్వాత ఆర్తి తన నోట్‌బుక్‌ లో ఓ కాయితం చించి వంకర టింకర రాతలో తమ దుస్థితి చెబుతూ ఏం కావాలో జాబితా కూడా ఇచ్చింది.

కరోనా విలయతాండవం ధాటికి ప్రపంచమే వణికిపోతోంది. చాలామంది ఉద్యోగాలు ఊడిపోయాయి. కొందరి కొలువులు కరోనార్ఫణం అయ్యాయి. భవిష్యత్తు కోసం నిరంతం ఆలోచిస్తూ శ్రమపడే వేతనజీవులు ఈ గంట గడిస్తే చాలు దేవుడా అని బెంబేలెత్తి పోతున్నారు. ఈ విపత్కరస్థితిలో ఢిల్లీలోని రెడ్‌లైట్‌ ఏరియా సెక్స్‌ వర్కర్ల జీవనం మరింత దుర్భరంగా మారింది. అక్కడి వాతావరణం శ్మశానాన్ని తలపిస్తోంది. ఆ ఏరియా వైపు తలచేసి కూడా ఎవరూ పడుకోవట్లేదు. జనజీవన స్రవంతికి దూరంగా చీకటి గయ్యారం లాంటి ఇళ్లల్లో బిక్చచచ్చి నిస్సహాయంగా ఉంటున్నారు.

M1

తాను పుండై.. మరొకరికి పండై, తాను శవమై.. ఎందరికో వశమై దేహాన్నే అంగడి సరుకుగా మార్చుకుని బతుకులీడుస్తున్న వేశ్యలు, వారి కుటుంబాలు బతికాయో చచ్చాయో కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ విషాద నేపథ్యంలోనే ఏం చేయాలో పాలుపోని ఆర్తి అప్‌నే ఆప్‌ స్వచ్ఛంద సంస్థకి ఫోన్‌ చేసింది. తమ దుస్థితిని కన్నీటి అక్షరాలతో రాసి విషాద సందేశంగా వారికి పంపింది. ఆ చిన్నారి లేఖకు కరిగిన సంస్థ సభ్యులు అత్యవసరమైన ఆహార సామగ్రి, శానిటైజర్లు, సోప్‌లు ప్యాక్‌ చేసి ఆర్తి ఇంటికి వెళ్లి ఆ కుటుంబ అవసరాలు తీర్చారు.

అప్పట్నుంచి రుచిరా ఫోన్‌ నిర్విరామంగా మోగుతునే ఉంది. ‘అమ్మా మీరు పేదలకు సాయం చేస్తున్నారని తెలిసింది. మేము రెండు ముద్దలు తిని ఎన్నో రోజులవుతున్నాయి. కరోనా కష్టకాలంలో మా వ్యాపారం సాగడం లేదు. అసలు మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడు. మీరే ఎలాగైనా మా ప్రాణాలు కాపాడలి’ అంటూ ఢిల్లీ,బిహార్,కోల్‌కత్తాల్లోని రెడ్‌లైట్‌ ఏరియాలనుంచి ఫోన్లు పోటెత్తాయి. రుచిరా గుప్తాకు ఈ స్పందన చూశాక అంతులేని ఆవేదన గుండెలో గూడుకట్టుకుంది. ఎంత దుర్భర పరిస్థితిలోఉంటే ఎదుటి వ్యక్తి ఎదుట చేతులు చాస్తారు? ఈ అన్నార్తులను ఎలాగైనా ఆదుకోవాల్సిందేనని మనసులో సంకల్పించుకున్నారు.

రెడ్‌లైట్‌ ఏరియాల్లో వేశ్యల దుర్భర జీవనం రుచిరాగుప్తా మనసులో కదలాడింది. అక్కడ మనుషులకు ఏమాత్రం విలువ ఉండదు. వళ్ళు గుల్ల అవతున్న కస్టమర్లు వస్తే వారు కోరిని సుఖాలందించాల్సిందే! వెలుతురు ఏమాత్రం కనిపించని ఇరుకిరుకు చీకటి ఇళ్ళల్లో విధివంచితులుగా, శాపగ్రస్థులుగా సెక్స్‌వర్కర్లు బతుకుబండిని ఈడుస్తుంటారు. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత అక్కడ వెదికినా కనిపించదు. వారి దేహం వారిది కాదు...వారి ఆలోచనలు వారికి కావు. జీవితాంతం కట్టుబానిసల్లా ఉండాల్సిందే. ‘కడుపు దహించుకుపోయే పడుపుకత్తె రాక్షసరతిలో అర్ధనిమీలిత నేత్రాల భయంకర బాధల పాటల పల్లవి విన్నానమ్మా..’ అని శ్రీశ్రీ ఆవేదనతో రగిలిపోయింది అక్షరసత్యమని వీరి జీవితాలు చూస్తుంటే అనిపిస్తుంది. ఎలాగైనా సరే వారికి సాయం అందించాలని అప్‌నే ఆప్‌ సంస్థ నిర్వాహకురాలిగా ఉద్యమించింది.

గత మార్చి ఆఖరున కేంద్రం జనతా కర్ఫ్యూ అమలు చేసిన తర్వాత సెక్స్‌ వర్కర్లకు కష్టాలు మొదలయ్యాయి. ఒకటి కాదు రెండు కాదు దాదాపు నాల్గు నెలలుగా కరోనా అంతకంతకు ఉధృతమవుతుండటంతో ఎవరూ రాక పూట గడవడం కూడా కష్టమైంది. అన్ని సరిగా ఉన్నప్పుడే వీరి ఆదాయం అంతంత మాత్రం. ఏదో కుటుంబం గడవడానికి కావల్సినంత అంతే. పిల్లలు తమలా ఈ నరకకూపంలో చిక్కుకోరాదని పంటిబిగువున కష్టాలు తట్టుకుంటూ వారిని చదివిస్తున్నారు. అయితే ఈ విలయంతో స్కూళ్ళు మూతబడ్డాయి. మళ్లీ ఎప్పడు తెరుస్తారో తెలీదు. అన్నం దొరకడమే కష్టంగా మారిన ఈ సమయంలో స్కూలు యాజమాన్యం ఫీజులంటే ఏం చేయాలో తెలీక అల్లాడిపోతున్నారు.

రెడ్‌లైట్‌ ప్రాంతంలో నివసిస్తున్న సునీత (పేరుమార్చాం) సంస్థ అందించిన సరుకులు అందుకుంటూ ‘లాక్‌డౌన్‌ మొదలయ్యాక ఒక్కరంటే ఒక్కరు కూడా మమ్మల్ని ఆదుకోడానికి రాలేదు. కడుపుల మాడ్చుకుని నోరూ మూసుకుని బతుకుతున్నాం.. ఆ దేవుడే మా కష్టాలు చూసి మిమ్మల్ని ఇక్కడికి పంపించాడు’ అంటూ ఆవేశంగా పలికింది. సాయం అందుకున్న మిగిలిన వారు కూడా కళ్లల్లో నీళ్లు తిరుగుతుంటే వలంటీర్ల చేతులు పట్టుకుని కృతజ్ఞతలు తెలిపారు. ‘దయచేసి ఈ సాయాన్ని ఇక్కడితో ఆపకండి. మీరు కూడా రాకుంటే మేం నిజంగా చావాల్సి ఉంటుంది’ అంటూ గద్గద స్వరంతో పలికారు.

M2

సంస్థ నిర్వాకురాలు రుచిరా గుప్తా కు అకలి అంటే ఏంటో తెలుసు. అన్నం విలువ తెలుసు. పేదల యాతనలూ ఇంకా బాగా తెలుసు. తను జర్నలిస్ట్‌గా ఢిల్లీ,బిహార్, కోల్‌కతాల్లోని రెడ్‌లైట్‌ ప్రాంతాల్లో పలు సందర్భాల్లో పర్యటించంది. సెక్స్‌వర్కర్లుగా మారిన చాలామంది యువతుల దీనగాధల్ని వార్తా కథనాలుగా రాసింది. అయితే సమస్య ఇదీ అంటే సరిపోదుగా. పరిష్కారం కూడా అన్వేషించాలనుకుంది. అందుకే కేవలం ఇలాంటి అభాగ్యుల కోసం జర్నలిజం ఉద్యోగం వదిలేసుకుంది. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితిలో చేరింది. నేపాల్, కంబోడియా, వియత్నాం లాంటి దేశాల్లో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ నిరోధానికి కావల్సిన చట్టాల రూపకల్పనలో భాగస్వామి అయింది.

ఆ తర్వాత ఇండియాకు వచ్చింది. మన దేశంలోనూ ఏదో ఒకటి చేసి సెక్స్‌ వర్కర్లకు అండగా నిలవాలని ఆలోచించి.. 2002లో అప్‌నే ఆప్‌ ఉమెన్‌ వరల్డ్‌ వైడ్‌ సంస్థను ప్రారంభించింది. రుచిరాగుప్తా సేవాయజ్ఞానికి స్పందించిన ఇండియాగేట్‌ సంస్థ ఒక లారీ బియ్యం పంపింది. మరికొందరు సొమ్ము డొనేట్‌ చేశారు చేస్తున్నారు. మనసు మంచిదైతే చేస్తున్న పని సరైనదైతే ఎలాంటి ఆటంకాలు అంటవు అనడానికి అప్‌నే ఆప్‌ సంస్థే నిదర్శనం. నిత్యం ఆకలి అవమానాలతో కుమిలిపోతున్న సెక్స్‌వర్కర్లకు నేనున్నానని అంటున్న రుచిరాగుప్తా మరింత ముందుకు సాగాలి.

Next Story