ఏపీలో 2024లో జనసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు : సోము వీర్రాజు
By తోట వంశీ కుమార్ Published on 11 Aug 2020 6:04 AM GMTవచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, మిత్ర పక్షం జనసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేస్తామని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం బీజేపీ ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్, బీజేపీ రాష్ట్ర సహాయ ఇంచార్జ్ సునీల్ డియోదర్, మధుకర్ జీ, పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. మాజీ మంత్రి మాణిక్యాలరావు, స్వర్ణపాలెస్ ప్రమాద మృతులకు బీజేపీ నేతలు రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోము వీర్రాజు మాట్లాడుతూ.. రాష్ట్ర, దేశాభివృద్ది బీజేపీ లక్ష్యమని పేర్కొన్నారు. దేశంలో మానవ వనరులు సమృద్ధిగా ఉన్నాయని, తెలుగు వారు ప్రపంచ దేశాల్లో గొప్ప స్థానాల్లో ఉన్నారన్నారు. ఏపీలో మానవ వనరులను రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో వినియోగించాలని, అందుకోసం బీజేపీ అధికారంలోకి రావడం చాలా ముఖ్యమని తెలిపారు. ఎన్నికల్లో ఈ అంశాన్ని తెలుపుతూ ఏపీలో ముందుకు వెళతాం అని పేర్కొన్నారు.
మోదీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ అంటే అందరి జీవితాల్లో వెలుగులు నింపడమేనని ఆయన పేర్కొన్నారు. ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలను అందించాలన్నారు. జన్‌ధన్ ఖాతా ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపామని, రాజకీయాలు ఎన్నికల సమయంలోనే చేయాలని.. ఏపీ అభివృద్ధికి బీజేపీ కృషి చేస్తుందని ఆయన తెలిపారు. అందరి అభివృద్ధి కోసం అందరితో కలిసి పని చేద్దామనే ఉద్దేశంతో బీజేపీ అభివృద్ధి పనులు కొనసాగిస్తోందని సోము వీర్రాజు తెలిపారు. 2024లో మిత్రపక్షం జనసేనతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, అందుకోసం ఇప్పటి నుంచే కృషి చేస్తామని తెలిపారు.