ఉపరాష్ట్రపతితో భేటీ అయిన సోము వీర్రాజు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 31 July 2020 6:22 PM ISTఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత సోము వీర్రాజు తొలిసారి ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా తనను ప్రకటించిన తర్వాత ఉపరాష్ట్రపతి గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగిందని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. భేటీకి సంబంధించి ఫొటోలను కూడా షేర్ చేశారు.
పర్యటనలో భాగంగా సోము వీర్రాజు.. బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ రామ్ మాధవ్‌ను కలిశారు. ఈ భేటీకి సంబంధించి ఆయన ట్వీట్ చేస్తూ.. 'రామ్ మాధవ్ ను ఎప్పుడు కలిసినా ఒక గొప్ప వ్యక్తితో నాకు మంచి అనుబంధం ఉన్నట్టు అనిపిస్తుందని.. దేశం, పార్టీ గురించి ఆయనకు ఉన్న విజన్ నాకు స్ఫూర్తిదాయకమని ఫోటోలను షేర్ చేశారు. అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ ధియోడర్‌ను సోము వీర్రాజు కలిశారు.
ఇదిలావుంటే.. ఇటీవల ఏపీ బీజేపీ అధ్యక్షుడి మార్పు జరిగింది. ఏపీలో బీజేపీ బలోపేతమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న పార్టీ అధినాయకత్వం.. అధ్యక్షుడి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కన్నా లక్ష్మినారాయణ స్థానాన్ని రీప్లేస్ చేస్తూ ఫైర్ బ్రాండ్ సోము వీర్రాజును అధ్యక్ష పీఠంపై కర్చోబెట్టింది.