సోనూసూద్ పై మాజీ మంత్రి సోమిరెడ్డి ప్రశంసలు
By తోట వంశీ కుమార్ Published on 27 July 2020 12:36 PM ISTప్రముఖ నటుడు సోనూసూద్ కరోనా లాక్ డౌన్ నుంచి ఇప్పటి వరకూ ఏదొక రకంగా పేద ప్రజలకు సహాయం చేస్తూనే ఉన్నారు. లాక్ డౌన్ సమయంలో వివిధప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలను ప్రత్యేక విమానంలో, రైలులో పంపించిన ఘనత ఆయనకే దక్కింది. అలాగే విదేశాల్లో ఉన్న విద్యార్థులు కొందరిని ఆయన స్వదేశానికి తీసుకొచ్చారు. ఎందరో నిరాశ్రయులకు ఆయన ఆశ్రయం కల్పించి..రీల్ విలన్ కాస్తా రియల్ హీరో అయ్యారు. నిజానికి లాక్ డౌన్ సమయంలో సోనూసూద్ మానవత్వ దృక్పథంతో స్పందించడాన్ని పలువురు ప్రశంసించారు కూడా.
తాజాగా తెలుగు రైతుకు సోనూసూద్ ట్రాక్టర్ బహుకరించడంపై సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ వైరల్ గా మారాయి. చిత్తూరుకు చెందిన రైతు ఎడ్లకు బదులు తన ఇద్దరు కూతుర్లను పెట్టి పొలం దున్నుతున్న వీడియోను ఎవరో ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోనూసూద్ కంటపడటంతో ఆ రైతు వివరాలు తెలుసుకుని సాయంత్రానికల్లా వారికి ఒక ట్రాక్టర్ కొనిచ్చారు. సోనూసూద్ చేసిన ఈ సహాయాన్ని చూసిన తెలుగు ప్రజలు ఆయనను కొనియాడుతున్నారు. మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి కూడా ఈ మేరకు ట్వీట్ చేశారు.
'' నేనైతే ఇక మిమ్మల్ని విలన్ గా చూడలేను.సినిమాల్లో మీరు హీరో పాత్ర వేయాల్సిందే. టాటా, మహీంద్ర, ఇన్ఫోసిస్ వంటి సంస్థల దాతృత్వాలు చూశాం.ఒక వ్యక్తికి ఇంత పెద్ద హృదయం ఉంటుందని ఊహించలేదు.వలస కూలీలకు సాయం, మదనపల్లి రైతుకు ట్రాక్టర్,విద్యార్థులు స్వదేశం రావడంలో మీ చొరవ అభినందనీయం.'' అని ఆ ట్వీట్ లో రాశారు సోమిరెడ్డి.