హైదరాబాద్‌లో విషాదం.. కుటుంబంతో సహా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

By అంజి  Published on  2 March 2020 3:01 AM GMT
హైదరాబాద్‌లో విషాదం.. కుటుంబంతో సహా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

ముఖ్యాంశాలు

  • నగరంలోని హస్తినాపురంలో విషాదం
  • పురుగుల మందు తాగి ఇద్దరు పిల్లలు సహా తల్లిదండ్రులు ఆత్మహత్య
  • మృతుల స్వస్థలం దేవరకొండ మండలం నేరడుకొమ్మ

హైదరాబాద్‌: హస్తినాపురంలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. పురుగుల మందు తాగి ఇద్దరు పిల్లలు సహా తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు ప్రదీప్‌, స్వాతి దంపతులు. వారి కుమారులు కళ్యాణ్‌ (5), జయకృష్ణ (2) మృతి చెందారు. మృతుల స్వస్థలం దేవరకొండ మండలం నేరడుకొమ్మగా చెబుతున్నారు. ఆ కుటుంబం తరచూ ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడేవారని స్థానికులు చెబుతున్నారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకొని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.. మృతుడు ప్రదీప్‌.. నగరంలోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అని తెలిసింది. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రదీప్‌.. మానసిక ఒత్తిడి తట్టుకోలేకే ఈ పనికి ఒడిగట్టాడని తెలుస్తోంది. అయితే ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

మృతురాలు స్వాతి తండ్రి...

తన కూతురికి, అల్లుడికి మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని మృతురాలు స్వాతి తండ్రి చెప్పారు. 2012లో ప్రదీప్‌, స్వాతిల వివాహం జరిగిందని, రెండు రోజుల క్రితమే తన కూతురితో మాట్లాడనని స్వాతి తండ్రి పేర్కొన్నారు. శనివారం కరీంనగర్‌లో ఓ ఫంక్షన్‌కు వెళ్లాల్సి ఉండేనని, కాని వారి ఫోన్‌లు కలవలేదని చెప్పారు. ఇవాళ ఉదయం పోలీసులను తీసుకొని ఇంటికి వచ్చామని, తలుపులు పగలగొట్టి చూడగా నలుగురు చనిపోయి ఉన్నారని ఏడ్చుకుంటూ వాపోయాడు. సూసైడ్‌ నోట్‌లో రూ.40 లక్షల అప్పు ఉన్నట్లు చెబుతున్నారని.. కోట్ల రూపాయల ఆస్తి ఉంది.. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని స్వాతి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందో తెలియడం లేదన్నారు.

Next Story