రోహిత ఆచూకీ లభ్యం..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 Jan 2020 1:15 PM GMT
నగరంలోని గచ్చిబౌలి పీఎస్ పరిధిలో గత నెల డిసెంబర్ 26 నుండి కనిపించకుండా పోయిన సాఫ్ట్ వేర్ మహిళ రోహిత కేసును పోలీసులు చేధించారు. కుటుంబ కలహాలతో ఇంటి నుంచి వెళ్లిపోయిన రోహిత ఆచూకీని పోలీసులు పూణేలో కనుగొన్నారు.
ఇక రోహిత హైదరాబాద్ వచ్చి కుటుంబ సభ్యులను కలిసేందుకు నిరాకరిస్తుండటంతో గచ్చిబౌలి పోలీసులు.. రోహిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అంతకుముందు పోలీసులు మిస్సింగ్ విషయమై రోహితను పూణే పోలీస్ స్టేషన్ లో విచారించారు.
మిస్సింగ్ విషయమై రోహిత మాట్లాడుతూ.. నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు. నేనే పుణె చేరుకున్నాను. గచ్చిబౌలి లో గత కొంతకాలంగా నివాసం ఉంటున్నాను. గచ్చిబౌలి నుంచి నేరుగా ఆరంఘర్ చేరుకున్నాను. ఆ తర్వాత బస్సులో బెంగళూరుకు వెళ్ళాను. ఆ తర్వాత హుబ్లీ నుండి పుణె చేరుకున్నాను. ఈ నెల 13న పుణేలో గ్రావిటీ కన్సల్టెన్సీ అనే సంస్థలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. ఈ నెల 13 ముందు బెంగళూరులో హుబ్లీ లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేశాను. తదనంతరం పుణె చేరుకున్నాను. ఇంతలోనే పోలీసులు తనను గుర్తించి తనపై మిస్సింగ్ కేసు నమోదయిందని పుణె పోలీస్ స్టేషన్ తీసుకువచ్చారని రోహిత తెలిపింది. ఏదేమయినా దిశ లాంటి ఘటన తర్వాత రోహిత మిస్సింగ్ నమోదవడంతో ఏం జరిగిందోనని అంతా కంగారుపడ్డారు. చివరికి ఆచూకీ లభించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.