అయోధ్యలో ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది?.. గ్రౌండ్ రిపోర్టు ఏమిటి?
By సుభాష్ Published on 30 July 2020 12:06 PM ISTముఖ్యాంశాలు
అయోధ్య గ్రౌండ్ రిపోర్టు ఏమిటి?
అయోధ్య గ్రౌండ్ రిపోర్టు ఏమిటి? శంకుస్థాపన పనులు ఎంతవరకొచ్చాయ్?
అయోధ్యలో ఇప్పుడేం జరుగుతోంది? గ్రౌండ్ రిపోర్టు ఏమిటి?
దశాబ్దాల తరబడి కొందరు కలలు కంటున్న రోజు దగ్గరకు వచ్చేసింది. ఏది ఏమైనా.. అయోధ్యలో రామాలయాన్ని నిర్మిస్తామని కోట్లాది మంది కలలకు ప్రతీకగా భారీ రామాలయ నిర్మాణానికి కీలకమైన తొలి అడుగు మరో ఆరు రోజుల్లో పడనుంది. ఆగస్టు ఐదో తేదీన మధ్యాహ్నం సరిగ్గా 12-15 గంటల 15 సెకన్ల సమయంలో శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. సరిగ్గా అనుకున్న సమయానికి భూమిపూజ జరగాలని భావిస్తున్నారు.
ముందుగా అనుకున్న దానికి ఏ మాత్రం తేడా రాకుండా ఉండేలా భూమిపూజ కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భూమిపూజకు ఎక్కువ మందిని పిలవటం లేదు. కేవలం 200 మంది మాత్రమే ఆహ్వానిస్తున్నట్లు చెబుతున్నారు. శంకుస్థాపనకు హాజరయ్యే ప్రముఖుల్లో ప్రతి యాభై మందికి ఒక బ్లాక్ లో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం నాలుగు బ్లాకుల్లో ప్రముఖులు ఆసీనులవుతారు.
దేశంలోనే ప్రముఖ సాధువులు.. మహంత్ లు.. ఒక బ్లాక్ లో కూర్చుంటే.. ముఖ్యమంత్రులు.. ముఖ్య అతిధులు మరో బ్లాక్ లో కూర్చుంటే.. పారిశ్రామికవేత్తలు.. అధికారులు ఇంకో బ్లాక్ లో కూర్చుంటారు. రామజన్మభూమి కోసం సుదీర్ఘ కాలంగా పోరాటం చేసిన వారిని మరో బ్లాక్ ప్రత్యేకంగా కేటాయించనున్నారు. భూమిపూజ ముహుర్తానికి దాదాపు గంట ముందే అతిధులంతా హాజరుకానున్నారు. అయితే.. అధికారికంగా మాత్రం ఎంతమంది ఈ కార్యక్రమానికి పిలుస్తున్న విషయాన్ని రామజన్మభూమి తీర్థ ట్రస్టు వెల్లడించలేదు.
భూమిపూజకు ముందు కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని నిర్వహించనున్నారు. అయోధ్యలో భూమిపూజ జరిగే ప్రాంతాన్ని నిఘా వర్గాలు స్వాధీనం చేసుకున్నాయి. ప్రతి అడుగును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రామజన్మభూమి పరిసర ప్రాంతాల్ని సైతం శుభ్రపర్చటంతో పాటు.. అందంగా ముస్తాబు చేస్తున్నారు. ఇంతకూ అయోధ్య ఇప్పుడు ఎలా ఉందంటే.. ఒకలాంటి ఉద్విగ్న వాతావరణం నెలకొందని చెప్పాలి. భూమిపూజలో నక్షత్రాల్లాంటి ఐదు వెండి ఇటుకల్ని వాడనున్నారు. ఈ కార్యక్రమాన్ని డీడీలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. భూమిపూజకు మూడు రోజుల ముందు నుంచే అయోధ్య నగరం మొత్తం పండుగగా వేడుకల్ని నిర్వహించనున్నారు. అయితే.. ఇంట్లోనే పండుగల్ని నిర్వహించాలని కోరుతున్నారు. ఉగ్రదాడులకు తెగబడే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఇందులో భాగంగా నగరమంతా సెక్షన్ 144ను అమలు చేస్తున్నారు.