కుశలమా.. నవ వసంత మధురిమా.! అనాటి పాటకు ఈనాటి మాట.!
By మధుసూదనరావు రామదుర్గం Published on 26 July 2020 5:22 PM ISTసింగీతం శ్రీనివాసరావు నిరంతర ప్రయోగాల దర్శకుడిగా తెలుగుసినీ అభిమానులకు చిరపరిచితులు. కరోనా దాటికి థియేటర్లు మూతపడి, కొత్త సినిమాలు లేక చిన్నబోయిన తెలుగు ప్రేక్షకుల మనసు మరోసారి పురివిప్పి నర్తించేలా...అలనాటి బ్లాక్‌బస్టర్ సినిమా మాయాబజార్ ముచ్చట పట్టుకొచ్చారు. ఈ మధ్యన సోషల్ మీడియాలోనూ టీవీల్లోనూ మాయబజార్‌లో వాడుకోవాలని అనాడు అనుకున్నా కారణాల వల్ల పల్లవికే పరిమితమై మనసు పొరల్లో అట్టడుగున పడిపోయిన ఆ అద్భుత పల్లవికి తాజాగా చరణాలు జతపరచి ఆపాటను తన మనవరాలితో గానం చేసి హల్‌చల్ చేశారు.
సింగీతం శ్రీనివాసరావు ప్రతిష్టాత్మక మాయబజార్ సినిమాదర్శకత్వ శాఖలో పనిచేశారు. అప్పటి అనుభవాలను సంగతుల్ని నెమరు వేసుకుంటుంటే...కుశలమా పాట గుర్తొచ్చింది. ఆ పాట వాడకుండా వదిలేసిన సందర్భమూ గుర్తొచ్చింది. పింగళి నాగేంద్రగారు పల్లవి రాసి ఆపేసిన పాటకు ప్రాణం పోసేందుకు నడుం బిగించారు. అయితే ఈ పాట ఎందుకు ఆగిపోయింది.. ఎందుకు వాడుకోలేక పోయారు అన్న విషయాలను ఆసక్తికరంగా వివరించారు.
తెలుగు సినిమా ప్రతిష్ఠను నలుదిశలా వ్యాపింపజేసిన మాయబజార్ సినిమాకు మొదట సాలూరు రాజేశ్వరరావు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. అ సమయంలో శ్రీకరులూ దేవతలూ శ్రీరస్తూ అనగా, లాహిరిలాహిరి లాహిరిలో, చూపులు కలిసిన శుభవేళా, నీకోసమే నే జీవించునదీ.. ఈ నాలుగు పాటలు స్వరపరిచి సిద్ధం చేశారు. శశిరేఖ ప్రియదర్శినిలో అభిమన్యుణ్ణి చూస్తూ పాడే పాట ఉండాలి. దానికి పింగళిగారు పల్లవిగా కుశలమా.. కుశలమా నవ వసంత మధురిమ’ అంటూ రాశారు. సాలూరి ఆ పల్లవిని సుమధురంగా స్వరపరిచారు.
అయితే కొన్ని కారణాల వల్ల సాలూరి గారు మాయబజార్ సినిమా ప్రాజెక్టు నుంచి వైదొలిగారు. ఆ తర్వాత ఘంటసాలగారు సంగీతం అందించారు. పల్లవి దాకా పూర్తయిన కుశలమా పాట కూడా ఆగిపోయింది. ఘంటసాల గారు దానికి బదులు ‘నీవేనా నను తలచినది’ పాట ట్యూన్‌కట్టి రికార్డు చేయించారు. ఈ పాట కూడా సూపర్ హిట్టే!!
అయితే ఆరోజు అలా వదిలేసిన పాట తాలూకు జ్ఞాపకాలు సింగీతం గారిని వదల్లేదు. ఎక్కడో మనసు మూలలో దాగున్న ఆ సంగతుల లాక్‌డౌన్ సమయంలో కాసింత విశ్రాంతిగా కూర్చున్న ఆయన బుర్రలో మళ్లీ వెలిగింది. అంతేకాదు అలా పల్లవికే పరిమితమైన పాటను మళ్ళీ ఎందుకు రివైవ్ చేయకూడదనుకున్నారు. వెంటనే సినీగేయ రచయిత వెన్నెలకంటి గారిని సంప్రదించి ఎలాగైనా పాటను పూర్తి చేయమని అడిగారు.
వెన్నెలకంటి అది తనకు దొరికిన మహాభాగ్యమని భావించి సరే అన్నారు. పింగళి భక్తుడైన వెన్నెలకంటిగారు ఆ పింగళి అసంపూర్తిగా వదిలిన పాటను పూర్తిచేయడం విశేషమని చెప్పాలి. అయితే ఈ పాటకు ఆయన చాలా శ్రమించారు. పల్లవిలో అభిమన్యుడు అడిగినదానికి బదులుగా శశిరేఖ మాటను పల్లవికి కొనసాగింపుగా రాయాలనుకున్నారు. దాదాపు పది పల్లవులు రాశారు. చివరికి ‘కుశలమా కుశలమా కుసుమబాణ చతురిమా’ అని రాశాక తృప్తి చెందారు.
కుసుమబాణం అంటే మన్మధుని బాణం అని అర్థం. మన్మథుడు పూవిలుకాడు. తను వేసిన పూబాణం గుండెను తాకితే చాలు అవ్యక్త ప్రేమ భావనలు పొంగుకొస్తాయి. అందుకే చతురిమా అనే పదాన్ని తెలివిగా వాడారు వెన్నెల కంటి. తన పాటను గురుసమానులు పింగళిగారికి నివాళిగా అర్పిస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి సందర్భాలు తెలుగు వారికి కొత్తేం కాదు. 11వ శతాబ్దంలో వ్యాస మహాభారతాన్ని తెలుగులో అనువదించేందుకు ఆదికవి నన్నయ్య పూనుకుని ఆది సభ అరణ్య పర్వంలో సగం రాసి స్వర్గస్థులు కాగా.. మళ్లీ 13వ శతాబ్దంలో ప్రబంధ పరమేశ్వరుడిగా పేరొందిన ఎర్రన మిగిలిన అరణ్యపర్వం పూర్తి చేశారు. ఎర్రన ఈ పనికి పూనుకోకుంటే ఆంధ్రమహాభారతం అసంపూర్ణంగా మిగిలిపోయేది. ఈ పాట కూడా అంతే!
పాటను సింగీతం గారే స్వరపరిచారు. తన మిత్రుడు జైపాల్ సంగీతం సమకూర్చగా అభిమన్యుడి పాత్రకు తను, శశిరేఖ పాత్ర పరంగా తన మనవరాలు అంజనీ నిఖిల పాడారు. కానీ మనకెవరికీ ఇప్పటిదాకా మాయబజార్‌కు కొంతకాలం సాలూరి రాజేశ్వరరావు సంగీత దర్శకుడిగా వ్యవహరించాడని గానీ, కుశలమా పాటను అర్ధాంతరంగా ఆపేశారని గానీ తెలీదు. 60 ఏళ్ల కిందట జరిగిన ఆ తర్వాత మరుగున పడిన ఈ అసక్తికర ఘటనను మళ్ళీ వెలుగులోకి తీసుకురావడమే కాకుడా ఆగిపోయిన పాటకు జీవం పోసిన సింగీతం శ్రీనివాసరావు దర్శకుడిగానే కాదు.. గాయకుడిగా సంగీతం శ్రీనివాసరావు అనిపించుకున్నారు.