కరోనా నుండి కోలుకున్నాక‌ సైడ్‌ఎఫెక్ట్స్.. తాజా అధ్యయనంలో సంచ‌ల‌న విష‌యాలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Sept 2020 12:19 PM IST
కరోనా నుండి కోలుకున్నాక‌ సైడ్‌ఎఫెక్ట్స్.. తాజా అధ్యయనంలో సంచ‌ల‌న విష‌యాలు

కరోనా వైరస్‌తో ప్రపంచం అల్లాడిపోతోంది. ఇప్ప‌టికే ఈ వైరస్ కారణంగా లక్షల మంది ప్రాణాలు కోల్పోగా.. కొన్ని కోట్ల మంది దీని బాధితులున్నారు. అయితే.. ఈ వైర‌స్ బారిన ప‌డి చికిత్స పొంది కోలుకున్న ఎక్కువ‌మందిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయని‌ దక్షిణ కొరియాలో నిర్వహించిన ఓ ప్రాథ‌మిక‌ అధ్యయనం చెబుతుంది.

అధ్యయనం ప్ర‌కారం.. 10 కోట్ల మంది కరోనా బాధితులలో 9 కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నాక కూడా అలసట, మానసిక అలజడి, వాసన, రుచి కోల్పోవడం లాంటి దుష్ప్రభావాలను ఎదుర్కొంటున్నారని తేలింది. కరోనా నుంచి కోలుకున్న 965 మందిని పరిగణలోకి తీసుకుని, ఆన్‌లైన్ సర్వే నిర్వహించగా.. 879 మంది అంటే..91.1 శాతం తాము సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కొంటున్నామని తెలిపారు.

ఈ విష‌య‌మై.. కొరియా డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఏజెన్సీ (కేడీఎస్) అధికారి నౌన్ జన్ వూక్ మాట్లాడుతూ.. కరోనా నుంచి కోలుకున్న 26.2 శాతం మందిలో అలసట, ఏకాగ్రత లోపించడంలాంటి లక్షణాలు కనిపించాయన్నారు. 24.6 శాతం మంది తాము దేనిపై కూడా తగినంత దృష్టి పెట్టలేకపోతున్నామని తెలిపారు.

అలాగే.. మరికొంతమందిలో మానసిక అలజడి, రుచి, వాసన కోల్పోవడం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. కిమ్ షిన్-వూ క్యూంగ్పుక్ నేషనల్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసన్ కు చెందిన వైద్య నిపుణులు దక్షిణకొరియాలోని 5,762 మంది బాధితుల నుంచి ఈ వివరాలు కోరారని అన్నారు. ఈ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే సాగిందని, త్వరలోనే ఈ వివరాలపై వైద్య పరిశోధకులు మరింతగా విశ్లేషణ చేయనున్నారని తెలిపారు.

Next Story