'ఎడ్జ్'తో ఊపేస్తున్న శృతిహాసన్
By తోట వంశీ కుమార్ Published on 8 Aug 2020 1:59 PM GMTలోకనాయకుడు కమల్‌హాసన్ కూతురిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టినా.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శృతిహాసన్. నటిగా మాత్రమే కాదు.. ఓ గాయనిగా మ్యూజిక్ కంపోజర్ గా కూడా శృతి సినీలవర్స్ కి సుపరిచితమే. పలు ప్రైవేటు ఆల్బమ్స్‌లో పాటలు పాడడంతో పాటు.. తన తండ్రి నటించిన 'ఈనాడు' చిత్రానికి సంగీతం కూడా అందించింది. తాజాగా శ్రుతిహాసన్ 'ఎడ్జ్' అనే సింగిల్ సాంగ్ రూపొందించింది. ఈ పాటను తన యూట్యూబ్ ఛానల్‌లో విడుదల చేసింది.
ప్రస్తుతం ఈ వీడియో సాంగ్ యూట్యూబ్ లో వైరల్ అవుతోంది. అందులో బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ ప్రెజన్స్ తో శృతి ఆకట్టుకుంటుంది. ఆ వీడియోలో శృతి మ్యూజిక్ టాలెంట్ మనం చూడవచ్చు. "సంగీతం ప్రపంచంలో ఎక్కడైనా ప్రేక్షకులపై ఆధారపడి ఉంటుంది. కళాకారుడు ప్రదర్శిస్తున్న సంగీతాన్ని వినడానికి అక్కడకు వచ్చారా లేదా అనేది పరిగణలోకి వస్తుంది. మా కోసం పాడాలని కోరుకునే వారు ఏదైనా ఇష్టంగా వినండి" అని శృతి తెలిపింది.
పాశ్చాత్య బాణీల్లో స్వరపరిచిన ఈ పాట టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబును కూడా ఆకట్టుకుంది. ఈ పాటను ఎంతో ఇష్టపడుతున్నాను అంటూ మహేశ్ ట్వీట్ చేశారు. కంగ్రాచ్యులేషన్స్ శ్రుతిహాసన్... నువ్వు ఆలపించిన 'ఎడ్జ్' పాటను విన్నాను.. ఊపేసేయ్! అంటూ ప్రోత్సహించారు. 'ఎడ్జ్' పాట పూర్తిగా ఆంగ్లంలో సాగుతుంది. ఈ గేయానికి సాహిత్యం కూడా శ్రుతిహాసనే సమకూర్చింది.