విశాఖ షిప్‌యార్డ్‌ మృతుల కుటుంబాలకు రూ.50లక్షలు పరిహారం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Aug 2020 10:03 AM GMT
విశాఖ షిప్‌యార్డ్‌ మృతుల కుటుంబాలకు రూ.50లక్షలు పరిహారం

విశాఖలోని హిందూస్థాన్‌ షిప్‌యార్డులో భారీ క్రేన్‌ కుప్పకూలి 11 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.50లక్షల పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని యాజమాన్యం ప్రకటించింది.

ప్రమాదం జరిగి 24 గంటలు గడిచినా మృతుల కుటుంబాలకు ఎలాంటి పరిహారం ప్రకటించకపోవడంతో.. మృతుల కుటుంబాలకు చెందిన బంధువులు షిప్‌ యార్డ్‌ వద్దకు చేరుకున్నారు. వెంటనే పరిహారం ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ షిప్‌ యార్డ్‌ గేటు వద్దనే ఉండిపోయారు. దీంతో అక్కడ టెన్సన్‌ వాతావరణం ఏర్పడింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలో భాగంగా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.

ఈ నేపధ్యంలో మంత్రి అవంతి శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకొని నష్టపరిహారం, ఇతర అంశాలపై హిందూస్థాన్ షిప్ యార్డు లిమిటెడ్ యాజమాన్యం, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. అధికారులు, కార్మికులతోనూ ఆయన చర్చించారు. అనంతరం ఆయన పరిహారాన్ని ప్రకటించారు. షిప్ యార్డులో క్రేన్ ప్రమాదం దురదృష్టకరమని, కుటుంబ సభ్యులు, యూనియన్లతో చర్చించామని షిప్ యార్డ్ చరిత్రలో ఎన్నడు లేని పరిహారం చెల్లించాలని నిర్ణయించామని అన్నారు. ఒక్కో కుటుంబానికి 50లక్షలు, పర్మినెంటు ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, కాంట్రాక్టు కార్మికుల కుటుంబాల్లో ఒకరికి కాంట్రాక్టు సంస్థల్లో శాశ్వత ఉపాధి కల్పించనున్నట్టు అవంతి వివరించారు. ఇవి కాకుండా హిందూస్థాన్ షిప్ యార్డు లిమిటెడ్ ద్వారా అదనపు సౌకర్యాలు కలుగుతాయని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా మారుతున్న నగరం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఈ చర్యలు దురదృష్టకరమని మంత్రి అవంతి అన్నారు.

Next Story