ఓటమికి చింతించకు.. 16ఏళ్ల ప్రాయంలోనే అగ్రశ్రేణి బౌలర్లను గడగడలాడించావ్.!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 8 March 2020 2:02 PM GMTఆస్ట్రేలియాతో నేడు జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత మహిళల జట్టు చివరి మెట్టుపై బోల్తా పడిన విషయం తెలిసిందే. టోర్నీ అసాంతం అదరగొట్టిన హర్మన్ సేన.. ఫైనల్ ఫైట్‌లో మాత్రం తలవంచింది. అయితే.. ముఖ్యంగా లీగ్ దశలో బ్యాటింగ్ భారాన్ని మోసిన యువ సంచలనం షఫాలీ వర్మ ఫైనల్ ఫైట్‌లో నిరుత్సాహపరిచింది.
ఆస్ట్రేలియా నిర్దేశించిన 184 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు.. ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. అప్పటివరకూ షఫాలీ రూపంలో మంచి ఎటాకింగ్ గేమ్ ఆడే బ్యాట్స్ ఉమెన్ ఉందన్న ధైర్యం ఉంది. టీమ్ మేనేజ్‌మెంట్ కూడా పవర్ ప్లే ముగిసే వరకైనా షపాలీ క్రికెటర్ క్రీజులో ఉంటుందని ఆశించింది. కానీ మొదటి ఓవర్‌లోనే అవుటై తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది. ఇక అవుటైన తీరు పట్ల ఈ యువ క్రికెటర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
ఔటై పెవిలియన్‌కు చేరిన షఫాలీ.. ఓటమి అనంతరం కన్నీటి పర్యంతమయ్యింది. కెప్టెన్ హర్మన్, తోటి క్రికెటర్లు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేసినా తన ఏడ్పును మాత్రం ఆపలేదు. కాగా, షఫాలీ కన్నీరు పెట్టుకున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు ఆమెకు ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. ‘కేవలం పదహారేళ్ల ప్రాయంలోనే అగ్రశ్రేణి బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నావు. భవిష్యత్తులో టీమిండియాకు ఎన్నో విజయాలు అందిస్తావు. టైటిల్ నెగ్గకున్నా మా హృదయాలను గెలిచావ్’అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.