ప్రణబ్ ఆరోగ్యంపై కుమార్తె భావోద్వేగ ట్వీట్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 12 Aug 2020 4:44 PM ISTభారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) ఆరోగ్యం విషమంగా ఉన్న విషయం తెలిసిందే. ఆయనకు ఢిల్లీలోని ఆర్మీ రిసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్‌లో వెంటిలేటర్‌పైన చికిత్స కొనసాగుతుంది. అయితే.. తన తండ్రి ఆరోగ్యం మరింత క్షీణించడంతో ప్రణబ్ ముఖర్జీ కుమార్తె.. షర్మిష్ఠా ముఖర్జీ ట్విటర్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు.
గత సంవత్సరం ఆగస్టు 8న నేను చాలా సంతోషంగా ఉన్నాను. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్నను ఆ రోజే మా నాన్న అందుకున్నారు. సరిగ్గా సంవత్సరానికి.. ఆగస్టు 10న నాన్న అనారోగ్యానికి గురయ్యారు. ఆయన విషయంలో భగవంతుడికి ఏది సరైనది అనిపిస్తే.. అదే చేస్తే బాగుంటుంది. జీవితంలో సంతోషమైనా.. బాధైనా తట్టుకునే శక్తిని భగవంతుడు నాకు ప్రసాదించాలి. ఆయన గురించి ఆలోచిస్తున్న వారందరికీ హృదయ పూర్వక కృతజ్ఞతలు ప్రకటిస్తున్నానని షర్మిష్ఠ ట్వీట్ చేశారు.
ఇదిలావుంటే.. 2012 నుంచి 2017 వరకు భారత 13వ రాష్ట్రపతిగా సేవలు అందించిన ప్రణబ్‌ముఖర్జీకి.. బ్రెయిన్ సర్జరీతోపాటు ప్రణబ్‌కు కరోనా వైరస్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌లో వెల్లడించారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో సోమవారం ఆయనకు ఢిల్లీలోని ఆర్మీస్ రిసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్ వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. సర్జరీ అనంతరం ఆయన ఆరోగ్యంలో ఎలాంటి పురోగతి లేదని.. పరిస్థితి మరింత క్షీణించిందని మంగళవారం సాయంత్రం వైద్యులు తెలిపారు.