ఢిల్లీలో షాహీన్‌ బాగ్‌ లాగా హైదరాబాద్‌ లో నిరసన ప్రదర్శనలు చేయాలని ప్రయత్నిస్తే వాటిని అనుమతించబోమని హైదరాబాద్‌ పోలీసులు తేల్చి చెప్పారు. హైదరాబాద్ పోలీస కమీషనర్‌ అంజనీ కుమార్‌ మాట్లాడుతూ.. ఇలాంటి నిరసన ప్రదర్శనలకు హైదరాబాద్‌లో స్థానం లేదని ఆయన స్పష్టం చేశారు. మిగతా నగరాల్లో జరిగే నెగటివ్‌ కార్య క్రమాలను హైదరాబాద్‌ లో జరగనీయమని ఆయన కుండ బద్దలు కొట్టారు.

అసలు తన వద్దకు ఎవరూ షాహీన్‌బాగ్‌ తరహా నిరసనల కోసం అనుమతిని కోరలేదని ఆయన చెప్పారు.సరైన పద్ధతిలో అనుమతిని కోరిన వారికి ఇబ్బందులు కలిగించడం తమ లక్ష్యం కాదని, ప్రముఖ స్థలాలు, కూడళ్ల వంటి చోట్లలో మాత్రం నిరసన ప్రదర్శన చేస్తే మాత్రం అనుమతి లభించదని ఆయన చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే రీతిలో నిసరనలు చేయకూడది ఆయన అన్నారు. సాధారణప్రజలకు ఇబ్బందులు కలిగే రీతిలో నిరసన ప్రదర్శన లు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన అన్నారు.

అత్యవరస పరిస్థితుల్లో ఉన్నవారికి, యాంబులెన్స్‌ లకు దారి ఇవ్వకపోతే చాలా ఇబ్బందులు కలుగుతాయని, అందుకే తాము ఇలాంటి నిరసనలకు అనుమతించే ప్రసక్తే లేదని అంజనీకుమార్‌ తెలియచేశారు. ఇలాంటి కార్యక్రమాలను అసాంఘిక శక్తులు ఉపయోగించుకుని, అలజడి సృష్టించే ప్రమాదం ఉందని, అందుకే కఠిన చర్యలు తప్పవని ఆయన అన్నారు.

మరో వైపు పాత బస్తీలోని బార్కాస్‌ ప్రాంతంలోని వాజూదీ నగర్‌ పరిసర ప్రాంతాల్లో మహిళలు షాహీన్‌బాగ్‌ తరహా నిరసనలు నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. ఈ సన్నాహాలను పోలీసులు అడ్డుకున్నారు. వారు దగ్గర్లోని ఒక దర్గాలో నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా, దర్గా యాజమాన్యం పై ఒత్తిడి తెచ్చి అక్కడి నుంచి వారిని పంపించేశారు. వారికి మధ్యాహ్నం భోజనాలు వడ్డించే ప్రయత్నాలను కూడా పోలీసులు అడ్డుకున్నారు. అదే సమయంలో మెహదీ పట్నం, టోలీ చౌకీ, మొగల్‌ పురాల వద్ద నిసనలు తెలిపేందుకు మహిళలు ప్రయత్నించారు. కానీ పోలీసులు వారిని కూడా అక్కడ నుంచి పంపించేశారు. అయితే తాము ఎన్యూమరేటర్లు వస్తే ఏం చేయాలో చెప్పేందుకే తాము ప్రయత్నించామని ముస్లిం మహిళల నేతలు చెబుతున్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.