తెలంగాణలో కొత్తగా ఏడు వైద్య కళాశాలల స్థాపన..!

By అంజి  Published on  7 Dec 2019 6:05 AM GMT
తెలంగాణలో కొత్తగా ఏడు వైద్య కళాశాలల స్థాపన..!

హైదరాబాద్ : గడచిన కొన్ని సంవత్సరాలుగా తెలంగాణలో వైద్య ఆరోగ్య సదుపాయాలను వీలైనంతమేరకు మెరుగు పరిచేందుకు ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మెడికల్ కళాశాలల్లో సీట్లను పెంచడం, కొత్తగా మరికొన్ని మెడికల్ కాలేజీలను స్థాపించడంలాంటి ఆలోచనలు బలంగా సాగుతున్నాయి. ప్రత్యేకించి రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఈ ఆలోచనలకు మరింత ఊతం వచ్చింది.

వీటిలో భాగంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఈటెల రాజేందర్ కొత్త వైద్య కళాశాలల స్థానపనకు అనుమతులకోసం, నిధులకోసం అభ్యర్థించేందుకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ హర్షవర్థన్ ని కలిశారు. ఈ విద్యాసంవత్సరం ఆరంభంలో కొత్తగా ఒక్కొక్కదానికీ 150 సీట్ల చొప్పున రెండు మెడికల్ కాలేజీలు నల్గొండలో, సూర్యాపేటలో ప్రారంభమయ్యాయి. వచ్చే విద్యాసంవత్సరానికి మరికొన్ని వైద్య కళాశాలల స్థాపనకు ఏర్పాట్లు సాగుతున్నాయి.

కేంద్ర వైద్య ఆరోగ్య - కుటుంబ సంక్షేమ శాఖ కనీసం రాష్ట్రంలో స్థాపించబోయే మూడు వైద్య కళాశాలలకు ఆర్థిక సాయం చేస్తానని మాటకూడా ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కేంద్ర మంత్రిత్వ శాఖ ఆర్థిక సాయం చేస్తానని మాట ఇచ్చిన ఆ మూడు వైద్య కళాశాలల స్థాపనకు పూర్తి స్థాయి ప్రాజెక్ట్ రిపోర్ట్ లనుకూడా సిద్ధం చేస్తున్నాయి.

Osmania Medical College Hyderabad (7) (1)

మొత్తంగా చూస్తే సనత్ నగర్ లో ఉన్న ఇఎస్ఐ వైద్య కళాశాలతో సహా పది వైద్య కళాశాలలకు అదనంగా మరో ఏడు వైద్య కళాశాలలను కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో ప్రారంభించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు యోచిస్తున్నారు. ఖమ్మం, కరీంనగర్, సంగారెడ్డి, మంచిర్యాల, భద్రాచలం, భూపాలపల్లి, తాండూరు లేదా వికారాబాద్ జిల్లాలను ఇందుకోసం ఎంపిక చేశారు.

వీలైనంత త్వరలో కొత్త మెడికల్ కళాశాలల ఏర్పాటు జరుగుతుందన్న ఆశతో ఉన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం, వైద్యుల సంఖ్యను పెంచడంద్వారా ప్రజారోగ్య పరిరక్షణపై పూర్తి స్థాయిలో శ్రద్ధ వహించాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం. గడచిన ఆరు నెలలుగా ఈ కలను సాకారం చేయడానికి ప్రయత్నాలు గట్టిగా సాగుతున్నాయి. రాష్ట్ర స్థాయిలోనూ, కేంద్రమంత్రిత్వ శాఖతోనూ దీని గురించి పలుమార్లు ముమ్మరంగా సమావేశాలుకూడా నిర్వహించారు.

ప్రస్తుత విద్యా సంవత్సరంలో..

ఈ విద్యా సంవత్సరంలో నల్గొండలో, మిర్యాలగూడలో కొత్తగా వైద్య కళాశాలల్ని ఏర్పాటు చేయడానికి అనుమతులు రావడం రాష్ట్ర ప్రభుత్వానికి కొంత సంతోషాన్ని కలిగించిన విషయమే. దీనివల్ల ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న మెడికల్ సీట్లు మొత్తం 1550కి చేరుకున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు 700 సీట్లు ఉండేవి. గడచిన ఐదు సంవత్సరాల్లో అవి 1550కి పెరిగాయి.

మెడికల్ కళాశాలలు & ఎం.బి.బి.ఎస్ సీట్ల వివరాలు

ప్రభుత్వ మెడికల్ కళాశాలలు : 10

ప్రభుత్వ ఎం.బి.బి.ఎస్ సీట్లు : 1550

గాంధీ ఆసుపత్రి (200 seats); ఉస్మానియా వైద్య కళాశాల (250); కాకతీయ వైద్య కళాశాల వరంగల్ (200); రిమ్స్, ఆదిలాబాద్ (100); ప్రభుత్వ వైద్య కళాశాల, నిజామాబాద్ (100); ప్రభుత్వ వైద్య కళాశాల, మహబూబ్ నగర్ (150); ప్రభుత్వ వైద్య కళాశాల, సిద్దిపేట (150); ప్రభుత్వ వైద్య కళాశాల, సూర్యాపేట (150); ప్రభుత్వ వైద్య కళాశాల, నల్గొండ (150) మరియు ఇ.ఎస్.ఐ.సి వైద్య కళాశాల, సనత్ నగర్ (100).

ప్రైవేట్ వైద్య కళాశాలలు : 22

మొత్తం సీట్ల సంఖ్య : 3050

మొత్తం ఎం.బి.బి.ఎస్ సీట్లు : 4600 ( మొత్తం 32 వైద్య కళాశాలల్లో )

ప్రతిపాదించిన కొత్త వైద్య కళాశాలలు : ఖమ్మం, కరీంనగర్, సంగారెడ్డి, మంచిర్యాల, భద్రాచలం, భూపాలపల్లి, తాండూర్ లేదా వికారాబాద్

ఎం.సి.ఐని తొలగించిన తర్వాత వైద్య విద్యలో సంస్కరణలు

  • వైద్య కళాశాలలు, సీట్ల సంఖ్య పెరగడం
  • ఈ సంవత్సరం, దేశంలో 27 కొత్త వైద్య కళాశాలల స్థాపన
  • తెలంగాణలో రెండు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటు

ఇ.డబ్ల్యు.ఎస్ కోటా ప్రభావం :

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో దాదాపుగా 300 మెడికల్ సీట్లు, ప్రైవేటు వైద్య కళాశాలల్లో 200 సీట్లు, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అదనంగా ఎం.బి.బి.ఎస్ సీట్లు

కొత్త ఎం.బి.బి.ఎస్ సిలబస్ ప్రభావం :

  • విలువలు, సమాచార మార్పిడి, రోగుల నిరసన హక్కులపై పాఠాలు
  • ప్రజారోగ్యంమీద, అవయవదానంమీద, మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం
  • విద్యార్థులకు ప్రాథమిక అవగాహనా తరగతులు
  • సంబంధిత ఇతర వ్యవహారాలపై శ్రద్ధ వహించేందుకు సమయం కేటాయింపు
  • క్లాస్ రూమ్స్, ఓపీడీ, ల్యాబొరేటరీల సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించడం

రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ప్రజారోగ్య పరిరక్షణకు అన్ని ఏర్పాట్లూ చేయాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం. ఈ లక్ష్య సాధనకోసం, పూర్తిగా రాష్ట్రంలోని అన్ని వర్గాలకూ వైద్య సదుపాయం అన్ని వేళలా అందుబాటులో ఉండేలా చూసేందుకు సర్కారు అహరహం శ్రమిస్తోంది.

Gandhi Hospital 602x400

వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణలో ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. మొత్తంగా అన్ని జిల్లాల్లోనూ అత్యాధునిక, ప్రత్యేక వైద్య సదుపాయాలతో పూర్తి స్థాయిలో వైద్య కళాశాలల స్థాపన, పడకలు పెంచడం, వైద్య విద్య సీట్లు పెంచడం తద్వారా వైద్యుల సంఖ్యను పెంచడం సాధ్యమైన రోజున బంగారు తెలంగాణ కల సాకారం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం ఈ ఒక్క అంశం వల్ల మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుందని కాదుగానీ, సర్వతోముఖాభివృద్ధిలో ఈ రంగంయొక్క పాత్ర మాత్రం అత్యంత కీలకమైనదని చెప్పొచ్చు.

Next Story