గుంటూరు: 12 ఏళ్ల కిందట అత్యాచారం, హత్యకు గురైన ఫార్మా విద్యార్థిని డెడ్‌బాడీకి రీ పోస్టుమార్టం పూర్తి అయ్యింది. చెంచుపేటలో ఫోరెన్సిక్‌ నిపుణుల బృందం పోస్టుమార్టంను పూర్తి చేసింది. ఫార్మా విద్యార్థిని పుర్రె, అస్థికలపై ఫోరెన్సిక్‌ నిపుణులు గాయాలను గుర్తించారు. ఫార్మా విద్యార్థిని ఎముకల నుంచి ఫోరెన్సిక్‌ నిపుణులు అవశేషాలు సేకరించారు. గత పోస్టుమార్టం నివేదికలోని అంశాలను పరిశీలించారు. సీబీఐ ఎస్పీ విమల్‌ నేతృత్వంలో రీ పోస్టుమార్టం జరిగింది. డెడ్‌బాడీకి తెనాలి సబ్‌కలెక్టర్‌, తహశీల్దార్‌ పంచనామా నిర్వహించారు. ఫోరెన్సిక్‌ రిపోర్టును సీల్డ్‌ కవర్‌లో సీబీఐ హైకోర్టుకు సమర్పించనుంది. పోస్టుమార్టం జరిగిన తీరును వీడియో రికార్డు చేశారు. సంప్రదాయాల ప్రకారం అస్థికలను మత పెద్దలు తిరిగి ఖననం చేశారు.

2007 డిసెంబర్‌ 27న విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలో బీఫార్మా విద్యార్థిని హత్యకు గురైంది. నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న సత్యంబాబును నిర్దోషిగా తేలుస్తూ 2017లో జైలు నుంచి విడుదల చేసింది. కేసు విచారణను కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. కాగా ఈ కేసులో ఇప్పటికే సీబీఐ పలువురిని విచారించింది.

కేసును త్వరగా చేధించాలని, సీబీఐతో న్యాయం జరుగుతుందని భావిస్తున్నారని బీఫార్మా విద్యార్థిని తల్లి పేర్కొంది. ప్రాంతీయ, కులతత్వాల వల్లే కేసును నీరు గార్చారని తెలిపింది. సిట్‌ దర్యాప్తు వల్ల ఎలాంటి ప్రయోజనం జరగలేదన్నారు. తన కూతురి కేసు విషయంలో పోలీసులే నిందితులని తల్లి శంషాద్‌ బేగం ఆరోపించారు.

అంజి గోనె

Next Story