120 కిలోల పొడి గంజాయి పట్టివేత.. కాలేజీ విద్యార్థులకు..

By అంజి  Published on  7 March 2020 12:04 PM GMT
120 కిలోల పొడి గంజాయి పట్టివేత.. కాలేజీ విద్యార్థులకు..

హైదరాబాద్‌: ఉప్పల్‌ నల్లచెరువు సమీపంలో 120 కిలోల పొడి గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేటీఎమ్‌ షోరూమ్‌ వద్ద టాటా ఇండిగో కారులో నిషేధిత పొడి గంజాయిని ఇద్దరు వ్యక్తులు అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

నిందితులు దామెరా నరేష్‌ (36), బొడ్డుల గణేష్‌ (34)లను ఉప్పల్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న 120 కిలోల పొడి గంజాయి విలువ రూ.12 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. నిందితుల నుంచి టాటా ఇండిగో కారు, రెండు సెల్‌ ఫోన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

విశాఖపట్నంలోని నర్సీపట్నం నుంచి పొడి గంజాయిని రెండు కిలోల ప్యాకెట్ల రూపంలో.. 60 ప్యాకెట్లు కారులో తెచ్చినట్టు పోలీసులు గుర్తించారు. ఉప్పల్‌, హైదరాబాద్‌, ఘట్‌కేసర్‌ పరిసర ప్రాంతాల్లో కాలేజీ విద్యార్థులకు రహస్యంగా గంజాయిని అమ్ముతున్నట్లు నిందితులు తమ విచారణలో ఒప్పుకున్నారని మేడ్చల్‌ ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ ప్రదీప్‌ రావు తెలిపారు.

నర్సీపట్నం నుంచి గంజాయి సరుకును పంపే లోహ రాజు, దాసరి మణికంట రాజులు పరారీలో ఉన్నారు. వారిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. నిందితులు నరేష్‌, గణేష్‌లను పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Next Story