రెండో రాజధానిగా హైదరాబాద్ - లోగుట్టు పెరుమాళ్లకెరుక!!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Nov 2019 6:51 AM GMT
రెండో రాజధానిగా హైదరాబాద్  - లోగుట్టు పెరుమాళ్లకెరుక!!

బీజేపీ పెద్దాయన చెన్నమనేని విద్యాసాగర రావు ఉన్నట్టుండి హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని కావాలన్న ప్రతిపాదనను తెరమీదకి తీసుకొచ్చారు. దేశానికి రెండో రాజధాని అవసరమని ఆయన వాదించారు. అందుకు అప్పుడెప్పుడో అంబేద్కర్ ప్రతిపాదించిన సూత్రాన్ని కూడా గుర్తు చేశారు.

ఇంతకీ చెన్నమనేని ఉన్నట్టుండి ఈ ప్రతిపాదనను ఎందుకు ముందుకు తెచ్చినట్టు? రాజకీయాల గురించే ఆలోచించేవారు విద్యాసాగర్ రావు ఆయన తన పాత మిత్రుడు, కొత్త బంధువు కేసీఆర్ ను ఆర్టీసీ కష్టాల నుంచి గట్టెక్కించేందుకు చేశారని వాదిస్తున్నారు. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారేమోనన్న భయాందోళనలు పెరిగి, తెలంగాణ సెంటిమెంట్ మరో సారి మన మెదళ్లను అగ్గిపుల్లల్లా భగ్గుమనిపించేస్తుందని, తద్వారా ఆర్టీసీ ఇష్యూ తెరమరుగైపోతుందని వారు వాదిస్తున్నారు.

అసలు కథ వేరే ఉంది!!

కానీ అసలు కథ వేరేగా ఉందంటున్నారు కొందరు తెలిసిన వాళ్లు. రెండో రాజధాని ఇష్యూను తెరపైకి తీసుకురావాలని బీజేపీ అధినాయకత్వమే ఆయనను పురమాయించిందంటున్నారు వారు. మూడు నాలుగు సంవత్సరాల క్రితం ఒక పెద్ద స్వామీజీ బిజెపి నేతలను కలిసి అసలు ఢిల్లీ వాస్తు మంచిది కాదని, ఢిల్లీలో ఉంటే దేశం ఏ నాటికీ బాగుపడదని చెప్పాడట. అందుకాయన చాలా ఉదాహరణలు కూడా ఇచ్చారట. ఇంగ్లీషు వారు కలకత్తా నుంచి ఢిల్లీకి దేశ రాజధానిని మార్చిన 35 ఏళ్లలోనే వారు దేశాన్ని విడిచి వెళ్లాల్సి వచ్చిందని, నెహ్రూ హయాంలో చైనా యుద్ధంలో ఓటమికి, లాల్ బహదూర్ శాస్త్రి మరణానికి, ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా కోర్టు తీర్పులు రావడానికి, ఆమె 1977 లో ఓడిపోవడానికి, 1983 లో చనిపోవడానికి, వాజ్ పేయి ప్రభుత్వం పరాజయం పాలు కావడానికి కూడా ఈ ఢిల్లీ వాస్తే కారణమని ఆయన చెప్పారట.

పార్లమెంటు భవనానికీ వాస్తు దోషం?

మనోహర్ జోషీ లోకసభ స్పీకర్్ గా ఉన్న సమయంలో కొద్ది కాలంలోనే 13 మంది ఎంపీలు వివిధ కారణాల వల్ల చనిపోయారు. దీంతో ఆయన లోకసభ వాస్తును అధ్యయనం చేయించి, అసలిది పనికిరాదు పొమ్మని తేల్చి చెప్పారు. ఆయన, ఆ తరువాత సుమిత్రా మహాజన్ లు కూడా పార్లమెంటు భవనానికి వాస్తు మార్పులు చేయాలని ప్రయత్నించారు. ఆ సాధు పురుషుడు కేవలం పార్లమెంటు భవనాన్ని మారిస్తే చాలదని, అసలు ఢిల్లీ నుంచి రాజధానిని మార్చి తీరాలని చెప్పారట. ఏకమొత్తంగా మార్చడం కష్టం కాబట్టి రెండో రాజధానికి ఏర్పాటు చేస్తే ఊరట కలుగుతుందని ఆయన చెప్పారట. సదరు సాధు పురుషుడు ఈ విషయాన్ని కేవలం బిజెపి అధినేతలకు మాత్రమే చెప్పి ఊరుకోలేదు. ఆయన ఆరెస్సెస్ ప్రముఖులకు కూడా ఈ విషయాన్ని చెప్పారట.

నిజమేమిటో, అబద్ధమేమిటో తెలియదు కానీ మనకు మాత్రం భలే టాకింగ్ పాయింట్ దొరికింది. ఇక టీవీ చానెళ్లలో ఛాతీ బాదుళ్లు, బల్ల గుద్దుళ్లూ .... భలే భలే .....!!

Next Story