• పరిశోధనలలో సంచలన నిజాలు

  • గబ్బిలాల నుంచే కరోనా వైరస్‌

కరోనా.. ఈ పేరు వింటేనే ప్రపంచం మొత్తం వణికిపోతుంది. చైనాలో పుట్టిన ఈ వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 200 దేశాల వరకు పాకింది. 2019లో వైరస్‌ పుట్టిందని తెలియగానే ఇప్పటి వరకూ దానిపై 200పైగా పరిశోధనా పత్రాలు విడుదలయ్యాయి. అసలు ఈ కరోనా వైరస్‌ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఎన్నో కారణాలు బయటకు వస్తున్నాయి. ఈ వైరస్‌పై రకరకాల కారణాలు చెప్పుకొంటున్నారు. ముఖ్యంగా గబ్బిలాల నుంచీ వచ్చిందని కొందరు చెబుతుంటే, జంతువులు, పాముల నుంచీ వచ్చిందని మరి కొందరు చెప్పుకొంటున్నారు.

అయితే ఈ వైరస్‌ గురించి అధిక మంది చెప్పిందేమిటంటే.. చైనా వుహాన్‌ నగరంలోని హుబే ప్రావిన్స్‌ లోని ఓ అడవిలో ఉన్న గుహలో ఉండే గబ్బిలాలపై ఈ వైరస్‌ ఉందనీ, ఆ గబ్బిలాలను తిన్న పాములకు ఈ వైరస్‌ సోకిందనీ, ఆ పాములను సరిగ్గా వండకుండా తినడం వల్ల మనుషులకు వ్యాపించిందనే వాదన ఇప్పుడు తెరపైకి వస్తోంది. అయితే దీని గురించి ఖచ్చితమైన ఆధారాలు మాత్రం లేవు.

మొదటి సారిగా 41 మందికి వైరస్‌..

2019 డిసెంబర్‌లో మొదటి సారిగా 41 మందికి ఈ వైరస్‌ సోకింది. వారిలో 27 మంది వుహాన్‌, హుబే ప్రావిన్స్‌ లోని ఓ మార్కెట్‌కు వెళ్లి పాములు, చేపలు కొనుక్కున్నారు. కాగా, కరోనా వైరస్‌ జీన్‌పై మాలిక్యూలర్‌ జీనోమిక్‌ పరిశోధన చేయగా నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి. ఈ వైరస్‌ 2019 నవంబర్‌లో పుట్టినట్లు తేలింది. ఇది 2002లో వచ్చిన సార్స్‌ వైరస్‌ లక్షణాలకు దగ్గరగా ఉన్నట్లు గుర్తించారు. ఈ సార్స్‌ వైరస్‌ చైనాలోని గ్వాండాంగ్‌ ప్రావిన్స్‌ లో వచ్చి, 2003 నాటికి 29 దేశాల్లో విస్తరించింది. మొత్తం 8వేల 98 కేసులు నమోదు కాగా, 774 మంది మృతి చెందారు. ఈ వైరస్‌ కూడా గుహలోనే పుట్టినట్లు తెలిసింది. అది కూడా గబ్బిలాల నుంచే మనుషులకు వ్యాపించింది. పరిశోధకులు గుర్తించినట్లు తెలుస్తోంది.

రెండు రకాల వైరస్‌లు కలిసి..

ఇకపోతే సార్స్‌-కరోనా వైరస్‌-1, సార్స్‌ -కరోనా వైరస్‌-2 అనే రెండు రకాల వైరస్‌లు కలిసి ఈ కొత్త వైరస్‌ పుట్టుకొచ్చిందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే సార్స్‌ -కరోనా వైరస్‌ 1 అనేది గబ్బిలాలపై ఉంటే, సార్స్‌ -కరోనా వైరస్‌ 2 అనేది మలేషియాలోని ప్యాంగోలిన్లపై ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అందువల్ల కేవలం గబ్బిలాలు కానీ, కేవలం ప్యాంగోలిన్లు కానీ, కరోనా వైరస్‌ సోకడానికి పూర్తి కారణమై ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నమాట. ఈ రెండు జీవులపై ఉండే రెండు వైరస్‌లు కలవడం వల్ల పుట్టిన కొత్త వైరసే కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) కావచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

కాగా, రెండు వైరస్‌లు కలిసి ఒకే వైరస్‌గా ఎలా ఏర్పడుతుందన్నది చాలా మంది శాస్త్రవేత్తలు వేస్తున్న ప్రశ్న. జన్యుపరిణామం క్రమంలో భాగంగా ఇలా జరిగి ఉండవచ్చని చెబుతున్నారు. మొత్తం మీద ఏ రాయి అయితేనేం తల పగలగొట్టుకోవడానికి అన్నట్లు.. ఏ వైరస్‌లు అయితేనేం ఓ మొండి వైరస్‌ తయారై ఇప్పుడు మన ప్రాణాలు తీస్తోంది. మొత్తం మీద పక్కా ఆధారాలు లేకున్నా.. శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలలో ఈ విషయాలు బయట పడినట్లు తెలుస్తోంది. మరి మున్ముందు ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో చూడాలి.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.