మూతి.. ముక్కు మూశాం.. చెవుల్ని కూడా మూయాల్సిందేనా?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 July 2020 7:39 AM GMT
మూతి.. ముక్కు మూశాం.. చెవుల్ని కూడా మూయాల్సిందేనా?

మాయదారి వైరస్ పుణ్యమా అని యావత్ ప్రపంచం వణికిపోతోంది. ఎంత ప్రయత్నించినా.. కేసుల తీవ్రత తగ్గట్లేదు. కొన్ని దేశాల్లో పరిస్థితి కంట్రోల్ లోకి వచ్చినా.. అమెరికా..బ్రెజిల్.. రష్యా.. భారత్ లాంటి దేశాల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పోల్చినప్పుడు తెలంగాణకు కొన్ని రెట్లు అధికంగా ఏపీలో వేలాది కేసులు రోజువారీగా నమోదవుతున్నాయి. దీంతో.. ఏపీ ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఇప్పటికే కోవిడ్ లక్షణాలుగా ఇప్పటికే తెలిసిన వాటిని వదిలేస్తే.. తాజాగా వెల్లడైన కొత్త పరిశోధన ఇప్పుడు కొత్త టెన్షన్ పుట్టిస్తోంది.

కరోనా వైరస్ మొదలై.. ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్న వేళలో.. శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని గుర్తించారు. పాజిటివ్ గా తేలిన వారు.. రుచిని కోల్పోతున్నట్లు గుర్తించారు. అయితే.. ఈ విషయం జనబాహుళ్యంలోకి వచ్చేసరికి చాలా ఆలస్యమైంది. కొందరికి ఆరోగ్యం బాగానే ఉన్నా.. కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇలాంటివారికి వెంటనే కరోనా పరీక్షలు చేస్తున్నారు. ఈ లక్షణం ఉన్న వారిలో నూటికి తొంభైశాతమందికి పాజిటివ్ గా తేలుతున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా మరో కొత్త విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. కోవిడ్ కారణంగా మరణించిన వ్యక్తులపై జరిపిన వ్యక్తులపై సరికొత్త అంశాలు వెలుగు చూశాయి. ఈ అధ్యయనంలోని కీలక విషయంలోకి వెళితే.. ఇప్పటివరకు కోవిడ్ వైరస్ ముక్కు.. మూతి ద్వారానే సోకుతుందన్న దానికి భిన్నంగా చెవుల ద్వారా వ్యాపిస్తుందన్న విషయాన్ని గుర్తించి ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వివరాల్ని సైంటిఫిక్ జర్నల్ జామాలో ప్రచురితమయ్యాయి.

అందులోని వివరాల ప్రకారం.. చెవి లోపల.. తల మాస్టాయిడ్ ప్రాంతంలో కోవిడ్ వైరస్ ఉనికి ఉన్న విషయాన్ని గుర్తించారు. మాస్టాయిడ్ అనేది చెవి వెనుక ఉండే ఒక బోలు ఎముక. కరోనాతో మరణించిన వారిలోని డెడ్ బాడీలోని మాస్టాయిడ్ ను తొలగించి.. వారి మధ్య చెవుల నుంచి నమూనాలుసేకరించారు. పరీక్షలు జరిపారు. ఇందులో ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. చెవుల్లో కోవిడ్ వైరస్ ఉనికిని గుర్తించారు.

ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి భయంతో ఇప్పటివరకూ మూతి.. ముక్కును మాత్రమే మూసి ఉంచుకుంటున్న ప్రజలు ఇప్పుడు చెవులను కూడా ఏదో ఒకదానితో కవర్ చేసుకోవాల్సి ఉంటుందా? అన్నది ప్రశ్న. లేదంటే.. సింఫుల్ గా చెవుల్లో కాటన్ ఉండ పెట్టుకుంటే సరిపోతుందా? అన్నది తేలాల్సి ఉంది. ఏమైనా.. ఇప్పటికే ఇబ్బంది పెడుతున్న కోవిడ్ మహమ్మారి రానున్న రోజుల్లో మరింతగా తిప్పలు తేనుందన్న వైనం తాజా అధ్యయనం స్పష్టం చేస్తుందని చెప్పక తప్పదు.

Next Story