హైదరాబాద్‌: గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ విద్యార్థుల పట్ల దాష్టీకంగా వ్యవహరించాడు. విద్యార్థిపై తన ప్రతాపాన్ని చూపించాడు. అంతటితో ఆగకుండా ఆ విద్యార్థిని ఇష్టానుసారంగా ప్రిన్సిపాల్‌ సుబ్రహ్మణం నేలకేసి కొట్టాడు. ఈ ఘటన సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల ఆశ్రమ పాఠశాలలో చోటు చేసుకుంది. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు ప్రిన్సిపాల్‌ను నిలదీశారు. నా ఇష్టం, మీకు దిక్కున్న చోట చెప్పుకోండంటూ విద్యార్థి తల్లిదండ్రుల పట్ల ప్రిన్సిపాల్‌ దురుసుగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రిన్సిపాల్‌ సుబ్రహ్మణ్యంను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ప్రిన్సిపాల్‌ సుబ్రహ్మణ్యం కులం పేరుతో దూషిస్తూ.. చితకబాదుతున్నాడని విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. చేయని తప్పుకు కొడుతున్నారని, వేధింపులు భరించలేక పోతున్నామని విద్యార్థులు వాపోయారు. విద్యార్థులను ప్రిన్సిపాల్‌ మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని స్థానికులు మండిపడ్డారు. ప్రిన్సిపాల్‌ సుబ్రహ్మణ్యంను తక్షణమే సస్పెండ్‌ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

గత నెలలో ఇలాంటి ఘటనే విజయవాడలో చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ విద్యార్థిని వాతలు వచ్చేలా, చర్మం కమిలేలా కొట్టాడు. పుస్తకంలో పేపర్‌ చింపాడని ఆరోతరగతి విద్యార్ధిని ప్రిన్సిపాల్‌ చితకబాదాడు. ఈ విషయమై విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన విచారణ చేపట్టారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులు విచక్షణ కోల్పోతున్నారు.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story