పిల్లాడి కథ.. చీఫ్ ఎడిటర్ ఉద్యోగం ఊడింది

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 Jun 2020 1:05 PM IST
పిల్లాడి కథ.. చీఫ్ ఎడిటర్ ఉద్యోగం ఊడింది

అందుకే అంటారు అక్షరం బలి కోరుకుంటుందని. అక్షరంతో ఆట అంత తేలికైంది కాదు. చిన్న తేడా వస్తే చాలు.. చర్యలు తీవ్రంగా ఉంటాయి. అందుకే మీడియా సంస్థల్లో పని చేసే వారు అద్యంతం అప్రమత్తంగా ఉండాలంటారు. ఒక్క అక్షరం తేడా మారే అర్థం ఒకఎత్తు అయితే..కొన్నిసార్లు చాలా చిన్న అంశాలే పెద్ద పెద్ద వివాదాలకు తెర తీయటమే కాదు.. అత్యున్నత స్థానాల్లో ఉన్న వారి ఉద్యోగాలు సైతం ఊడిపోయే పరిస్థితి.తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది.

టీటీడీకి చెందిన సప్తగిరి మాసపత్రిక తెలిసిందే. ఇందులో ఒక చిన్నపిల్లాడు ఒక కథ రాశాడు. అందులో కుశుడు సీతారాముల కొడుకు కాదని.. వాల్మీకి దర్బతో చేసిన బొమ్మ అంటూ బాలవాక్కు శీర్షికలో వచ్చిన సప్తగిరి తాజా సంచికలో పబ్లిష్ అయ్యింది. ఆ మాటకు వస్తే.. వాల్మీకి రామయాణానికి సంబంధం లేని ఎన్నో కథలు ఇప్పటికే చూశాం. వాటిని భరించటం ఏమో కానీ.. తాజాగా స్కూల్ పిల్లాడు రాసిన కథను అచ్చేసిన సప్తగిరి ఎడిటోరియల్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది.

తొమ్మిదో తరగతి చదివే పునీత్ అనే పిల్లాడు రాసినట్లుగా చెప్పిన కథలో.. లవుడు పసిబాలుడిగా ఉన్నప్పుడు వాల్మీకి ఆశ్రమంలో కనిపించకుండా పోతాడని.. దాంతో లవుడికి పోలిన పసిబాలుడ్ని వాల్మీకి దర్బతో తయారు చేసి కుశుడ్ని ఇస్తారని పేర్కొన్నాడు. ఆ బాలుడే కుశుడు అంటూ అందులో పేర్కొన్నారు. ఈ కథపై పెద్ద ఎత్తున విమర్శలు రావటమే కాదు.. హిందువుల మనోభావాల్ని దెబ్బ తీశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.

కథ రాసింది పిల్లోడే అయినా.. పబ్లిష్ చేసింది పెద్దలు కదా? అయినా సప్తగిరి లాంటి మాసపత్రికలో ఇలాంటివి రావటం ఏమిటంటూ రచ్చ షురూ అయ్యింది. ఈ పిల్లాడి కథ వ్యవహారం ఏపీ ప్రభుత్వం మీద నిందలువేసే వరకూ వెళ్లటంతో టీటీడీ రంగంలోకి దిగింది. అసలీ తప్పు ఎలా జరిగిందన్న విషయంపై విచారణ జరిపి.. చివరకు ఇందుకు బాధ్యులుగా సప్తగిరి మాసపత్రిక చీఫ్ ఎడిటర్ రాధారమణితో పాటు సబ్ ఎడిటర్ ఉత్తర ఫల్ఘుణిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. చిన్న పిల్లాడు రాసిన కథే అయినా.. అందుకు పెద్దలు భారీ మూల్యం చెల్లించక తప్పలేదు.

Next Story