శానిటైజర్ వాడుతున్నారా..? అయితే ఓ సారి ఇది చూడండి
By తోట వంశీ కుమార్ Published on 25 Jun 2020 6:15 PM ISTకరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి చేతులకు శానిటైజర్ పూసుకోవడం అలవాటుగా మారింది. శానిటైజర్ జేజులో లేనిదే బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి ఉంది. అకస్మాత్తుగా శానిటైజర్ బాటిల్ నుంచి మంటలు చెలరేగాయి. ఈ ఘటన రాజమహేంద్రవరంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. రాజమహేంద్రవరంలోని దేవీచౌక్ సెంటర్‌లో ఓ షాప్ ముందు బైక్‌లు పార్క్ చేసి ఉన్నాయి. ఓ బైక్ ట్యాంక్ కవర్‌లో ఉన్న శానిటైజర్ నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. క్షణాల్లో ఆ మంటలు బండి ముందు భాగమంతా వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు రావడం.. అది కూడా బైక్ పెట్రోల్ ట్యాంక్ కావడంతో ప్రజలు భయాందోళనకు గురైయ్యారు. వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశారు. స్థానికుల సాయంతో బైక్ యజమాని మంటలను అదుపు చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
శానిటైజర్ రాసుకొని పొయ్యి లేదా మండే స్వభావాలున్న వాటిని వెలిగిస్తే చేతులు కాలే ముప్పు ఉందన్న విషయం మీద ముందు నుండే ప్రచారం జరుగుతోంది. శానిటైజర్లలో ఉండే అల్కాహాల్ కంటెంట్ కు మండే స్వభావం ఎక్కువ. శానిటైజర్ ను వేడెక్కే చోట ఉంచితే ఇలానే జరగచ్చని అంటున్నారు నిపుణులు.