రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. రైతును లారీతో తొక్కించి..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 July 2020 8:11 AM GMT
రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. రైతును లారీతో తొక్కించి..

మహబూబ్‌నగర్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇసుక మాఫియా రెచ్చిపోయింది. తమ పనులను అడ్డుపడుతున్నాడనే కారణంతో ఓ రైతును లారీతో ఢీ కొట్టి ప్రాణాలు బలిగొన్నారు. రాజపూర్‌ మండలం తిరుమలాపూర్‌లో ఈ ఘటన జరిగింది. ఇసుక లారీలు తన పొలం గుండా వెలుతుండడంతో ఇసుక తన పొలంలో పడుతోందని రైతు నర్సింహులు కొంత కాలంగా ఇసుక మాఫియాతో గొడవ పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. బుధవారం అర్థరాత్రి నర్సింహులును ఇసుక లారీతో ఢీ కొట్టారు. తీవ్రగాయాలతో నరసింహులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

గత ఏడాది అదే గ్రామంలో ఒక రైతుని కూడా అడ్డు వచ్చాడనే నెపంతో ఇసుక మాఫియా ఇసుక దిబ్బ కూల్చి రైతుని హత్య చేసినట్లు కూడా పలువురు అంటున్నారు. ఇంత జరుగుతున్నా కూడా అధికారులు పట్టించుకోవడం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీ అద్దాలు ధ్వంసం చేశారు. ఇసుక మాఫియా ఆగడాలు అరికట్టాలని, నర్సింహులు కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు ధర్నాకు దిగారు. మృతదేహంతో ధర్నాకు దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇసుక మాఫియా ప్రతినిధులు స్థానిక ప్రజాప్రతినిధిని ఆశ్రయించారు. ఆయన సమక్షంలో ఇరువర్గాల మధ్య రాజీకి ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం.

Next Story
Share it