'సింహాచలం' ఘనత సంచయితదేనా.. వాస్తవమేంటి?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 31 July 2020 11:00 AM ISTఉత్తరాంధ్ర హిందూ భక్తులకు గురువారం తీపి కబురు చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ ఆలయాల్లో ఒకటైన సింహాచలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక నిధులు కేటాయించి మరింత అభివృద్ధి చేసేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ‘ప్రసాద్’ పథకానికి ఎంపిక చేసింది. దీని కింద ఏటా గ్రాంటు విడుదల చేస్తారు. ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చు. ఇది అందరూ సంతోషించే విషయమే.
ఈ విషయాన్ని ట్విట్టర్‌లో వెల్లడిస్తూ సింహాచలం దేవస్థానం, మన్సాస్ ట్రస్టు ఛైర్మన్ సంచయిత గజపతి ఆనందం వ్యక్తం చేసింది. అంత వరకు బాగానే ఉంది. కానీ దీని తాలూకు క్రెడిట్ అంతా తనదే అని ఆమె చెప్పుకుంది. తన నియామకం జరిగిపుడు వచ్చిన విమర్శల గురించి ప్రస్తావించి.. ఇప్పుడు తానే సింహాచలం ఆలయం కేంద్ర ప్రభుత్వ పథకానికి ఎంపికయ్యేలా చేసినట్లు మాట్లాడారు.
అంతటితో ఆగకుండా ఈ విషయంలో చంద్రబాబు నేతృత్వంలోని గత ప్రభుత్వం, కేంద్ర మంత్రిగా పని చేసిన అశోక్ గజపతి రాజు ఏమీ చేయలేకపోయారని విమర్శించారామె. ఐతే 2017లో చంద్రబాబు సర్కారు అధికారంలో ఉండగా సింహాచలం దేవాలయం తరఫున ‘ప్రసాద్’ పథకానికి ఎంపిక చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ వెళ్లింది. ఈ విషయాన్ని అశోక్ గజపతి రాజు ట్విట్టర్లో షేర్ చేశారు. అప్పుడు అధికారికంగా పంపిన దరఖాస్తు ప్రతిని ఆయన షేర్ చేశారు.
ఈ విషయం సంచిత దృష్టికి రాలేదంటే అదేమీ కాదు. ఈ ట్వీట్ మీద ఆమె స్పందిస్తూ.. దేవస్థాన ఈవో ఇలా లేఖ రాయలేరని.. ఆ పని చేయాల్సింది ప్రభుత్వం అని.. కానీ బాబు సర్కారు అలా చేయలేదని అన్నారు. తాను జగన్ తో మాట్లాడి లేఖ రాసినట్లు పేర్కొన్నారు. అందుకే ప్రసాద్ పథకానికి ఎంపికయ్యిందన్నారు. కానీ కేంద్రం విడుదల చేసిన నోట్ ప్రకారం వాస్తవం ఏంటంటే.. 2017లో సింహాచలం ఆలయం నుంచి వచ్చిన దరఖాస్తును అనుసరించే ‘ప్రసాద్’ పథకానికి ఎంపిక చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తాజా జీవోలో స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. అయినా సరే క్రెడిట్ అంతా తనది, జగన్ సర్కారుది అని సంచిత నొక్కి వక్కాణిస్తుండటం గమనార్హం.