అతను సంజు శాంసనా.. లేక జాంటీరోడ్సా..

By Newsmeter.Network  Published on  2 Feb 2020 5:19 PM IST
అతను సంజు శాంసనా.. లేక జాంటీరోడ్సా..

భారత యువ క్రికెటర్‌ సంజు శాంసన్‌ ఫీల్డింగ్‌ లో అదరగొట్టాడు. రాకరాక బ్యాటింగ్‌ లో అవకాశం వస్తే విఫలమైన ఈ కేరళ ఆటగాడు ఫీల్డింగ్‌ లో మాత్రం తన ప్రతిభ చూపించాడు. మౌంట్‌మాంగనీ వేదికగా జరిగిన ఐదో టీ20లో న్యూజిలాండ్‌ ఆటగాడు రాస్‌ టేలర్‌ కొట్టిన బంతిని సిక్స్‌ వెళ్లకుండా ఆపాడు. తద్వారా టీమిండియాకు నాలుగు పరుగులు సేవ్‌ చేశాడు. శార్దూల్‌ ఠాకూర్‌ వేసిన 8వ ఓవర్‌ చివరి బంతిని టేలర్‌ డీప్‌లో భారీ షాట్‌ ఆడాడు. అయితే అది సిక్స్‌ అనే అంతా భావించారు. కానీ చివరి నిమిషంలో బంతిని గాల్లో ఎగిరి పట్టుకున్న శాంసన్‌.. బౌండరీ లైన్‌ అవతలకు వెళ్లే క్రమంలో గ్రౌండ్‌లోకి విసిరేశాడు. దాంతో సిక్స్‌ అనుకున్న ఆ షాట్‌కు రెండు పరుగులే వచ్చాయి.

వాటే ఎ ఫీల్డింగ్‌ సంజు అంటూ టీమిండియా ఆటగాళ్లతో పాటు కామెంటేటర్లు సైతం కొనియాడగా.. శాంసన్‌ ఫీల్డింగ్‌ చూసిన అభిమానులు మాత్రం ముక్కున వేలేసుకుని ఔరా అనుకున్నారు. కాగా ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతుంది. ఇక నెటీజన్లు సంజూ శాంసన్‌ ఫీల్డింగ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. సూపర్‌ మ్యాన్‌ నువ్వు.. ఇలాగే కొనసాగించు.. బ్యాటింగ్‌ లో రాణిస్తే నీకు తిరుగులేదు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా మ్యాచులో భారత్ 7 పరుగుల తేడాతో గెలిచింది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌.. కేఎల్‌ రాహుల్‌(45; 33 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స్‌లు), రోహిత్‌ శర్మ(60 రిటైర్డ్‌ హర్ట్‌; 41 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) పాటు శ్రేయస్‌ అయ్యర్‌(33 నాటౌట్‌; 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 163 పరుగులు చేసింది. 164 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ నిర్ణీత 20ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేసింది.



Next Story