ఆ జంట ఎవరికీ అనుమానం రాకుండా ఎనిమిదేళ్లు కాపురం చేసింది.. పోస్టుమార్టంలో..!

By సుభాష్  Published on  10 Sept 2020 10:50 AM IST
ఆ జంట ఎవరికీ అనుమానం రాకుండా ఎనిమిదేళ్లు కాపురం చేసింది.. పోస్టుమార్టంలో..!

స్వలింగ సంపర్కం నేరం కాదు.. ప్రేమ అన్నది ఎవరిలో ఎవరి మీద ఎప్పుడు పుడుతుందో చెప్పలేము..! కొన్ని దేశాల్లో స్వలింగ సంపర్కం అన్నది తెలిస్తే చాలు ఎన్నో కఠినమైన శిక్షలు ఉంటాయి. చాలా దేశాలు స్వలింగ సంపర్కం విషయంలో తమ నిర్ణయాలు మార్చుకున్నాయి. స్వలింగ సంపర్కం నేరం కాదని 2018 సెప్టెంబర్ 6న భార‌త సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది. ఇప్పుడిప్పుడే కొన్ని జంటలు ఎంతో ధైర్యంగా పెళ్లి చేసుకుంటూ ఉన్నాయి. ఇంకా సమాజంలో పూర్తిగా మార్పు రాలేదనుకోండి. అయితే సమాజానికి భయపడి ఓ జంట తాము స్వలింగ సంపర్కులం కాదని.. ఓ దంపతులుగా 8 సంవత్సరాలు అన్యోన్యంగా గడిపింది. కానీ వారి జీవితంలో ఊహించని విషాదం జరగడంతో మరణించారు. పోస్టు మార్టంలో వారిద్దరూ స్వలింగ సంపర్కులు అని తేలింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని సెహూర్ లో చోటుచేసుకుంది.

వారిరువురూ 2012లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన రెండు సంవ‌త్స‌రాల‌కు ఒక పిల్లాడిని ద‌త్త‌త తీసుకొని పెంచుకుంటున్నారు. 8 సంవ‌త్స‌రాలుగా వారు హాయిగా గడిపారు. ఆగ‌స్టు 11న భార్య‌ భ‌ర్త‌లిద్దరి మ‌ధ్య చిన్న‌పాటి గొడ‌వ జరగడంతో భార్య త‌న శ‌రీరానికి నిప్పు అంటించుకుంది. భార్య‌ను కాపాడే ప్ర‌య‌త్నంలో అత‌నికి కూడా మంట‌లంటుకున్నాయి. భార్య ఆగ‌స్టు 12న చ‌నిపోయింది. ఆ వ్య‌క్తి ఆగ‌స్టు 16న క‌న్నుమూశాడు.

పోస్టుమార్టం రిపోర్టులో చనిపోయిన ఇద్ద‌రు మ‌గ‌వారేనని వైద్యులు గుర్తించారు. విష‌యాన్ని పోలీసులుకు తెలిపారు. చనిపోయిన ఇద్ద‌రు మ‌గ‌వారేన‌న్న విష‌యం పోలీసులు కుటుంబ‌స‌భ్యుల వ‌ద్ద ప్ర‌స్తావించ‌గా తమకు తెలియ‌ద‌ని స‌మాధాన‌మిచ్చారు. చ‌నిపోయిన భార్య పూర్తి రిపోర్ట్‌ను ప‌రిశీలించ‌గా.. చ‌నిపోయింది అమ్మాయి కాద‌ని.. అబ్బాయేన‌ని డాక్ట‌ర్లు నిర్థారించారు.

చ‌నిపోయిన భ‌ర్త త‌ర‌పు అన్న‌య్యను అడగగా.. తన త‌మ్ముడికి ఒక గే ప‌రిచ‌యం అయ్యాడ‌ని.. మేమిద్ద‌రం క‌లిసి బ‌త‌కాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలపగా.. అందుకు తాము ఒప్పుకోకపోవడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి.. పెళ్లి చేసుకొని దూరంగా ఉంటున్నట్లు చెప్పాడు. దీంతో వారిద్దరూ సమాజాన్ని నమ్మించడానికి భార్యాభర్తలుగా గడిపారు. అది కూడా ఎవరికీ అనుమానం రాకుండా.. 8 ఏళ్లుగా సెహూర్ నివ‌సిస్తున్నారని.. స్వ‌లింగ సంప‌ర్కులు అన్న అనుమానం తమకు రాలేదని స్థానికులు తెలిపారు.

Next Story