సమత కేసు: చార్జ్‌షీట్‌లో నమ్మలేని నిజాలు..!

By అంజి  Published on  14 Dec 2019 4:29 PM IST
సమత కేసు: చార్జ్‌షీట్‌లో నమ్మలేని నిజాలు..!

ముఖ్యాంశాలు

  • సమత కేసులో చార్జ్‌షీట్‌ దాఖలు చేసిన పోలీసులు
  • ఆసిఫాబాద్‌ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో చార్జ్‌షీట్‌
  • నిందితులను కఠినంగా శిక్షించానలి ప్రజాసంఘాల డిమాండ్‌

కుమ్రంభీం అసిఫాబాద్‌ జిల్లాలో దారుణంగా అత్యాచారం, హత్యకు గురైన సమత కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ హత్యకు సంబంధించి పోలీసులు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. సమత హత్యకు గురైన తర్వాత మూడు రోజుల వ్యవధిలోనే నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. చార్జ్‌షీట్‌లో నిందితులు ఏ1-షేక్‌బాబు, ఏ2-షాబుద్దీన్‌, ఏ3-షేక్‌ ముగ్దమ్‌ పేర్లను చేర్చారు. హత్య చేసిన నిందితులపై 302, 376డి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల సమాచారాన్ని చార్జ్‌షీట్‌లో ఉంచారు. 140 పేజీల చార్జ్‌షీట్‌లో ఇప్పటికే 44 మంది సాక్షుల పేర్లను పొందుపర్చారు. సమతను అత్యచారం చేసి ఆ తర్వాత గొంతుకోసి చంపారని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ పరీక్షలో తేలింది. సమత హత్య ఫోరెన్సిక్‌ నివేదికను పోలీసులు చార్జ్‌షీట్‌లో ఉంచారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు సోమవారం నుంచి సమత హత్య కేసును విచారించనుంది. గతంలోనూ ముగ్గురు నిందితులకు నేర చరిత్ర ఉందని, వారికి కఠిశ శిక్ష పడుతుందని జిల్లా ఎస్పీ మల్లారెడ్డి పేర్కొన్నారు.

కొద్ది రోజుల క్రితం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో సంచలనం సృష్టించిన సమత హత్య కేసును తెలంగాణ ప్రభుత్వం సిరీయస్‌ తీసుకుంది. స్పెషల్‌ కోర్టును ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో కేసును యుద్ధప్రతిపాదికన పరిష్కరించేందుకు స్పెషల్‌ కోర్టును ఏర్పాటు చేసింది. జీవో ఆర్టీ నెం. 647 ద్వారా స్పెషల్‌ కోర్టును ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సమత అత్యాచారం, హత్య ఘటనపై తెలంగాణ వ్యాప్తంగా దళితులు, ప్రజసంఘాలు, మహిళలు పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.

నవంబర్‌ 24న ఒంటరిగా ఉన్న సమతను నిందితులు చెట్ల పొదల్లోకి ఈడ్చుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. అనంతరం సమతను హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. కాగా ఈ ఘటనకు సంబంధించి నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు పలు కీలక ఆధారాలను సేకరించారు. విచారణలో అత్యంత కీలకం కానున్న నిందితుల డీఎన్‌ఏ రిపోర్టును పోలీసులు సేకరించారు. సమతను హత్య చేసిన నిందితుల తరఫున వాదించకూడదని ఆదిలాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నాడు సమత కుటుంబాన్ని జాతీయ బాలల హక్కుల కమిషన్‌ సభ్యురాలు ప్రజ్ఞా పారందే పరామర్శించారు. నిందితులను కఠినంగా శిక్షించేలా చూస్తామని ఆమె పేర్కొన్నారు.

Next Story