విధుల్లో అలసి సొలసిన పోలీస్

By రాణి  Published on  4 April 2020 7:33 AM GMT
విధుల్లో అలసి సొలసిన పోలీస్

అనవసరంగా బయట తిరిగేవారిపై కాస్త లాఠీకి పనిచెప్తే పోలీస్ అన్న శత్రువైపోతున్నాడు. ఈ ఫొటో చూడండి. విధి నిర్వహణలో అలసిపోయిన పోలీస్ రోడ్డుపైనే అలసట తీర్చుకుంటున్నారు. ఏ..వారు ఇళ్లకు వెళ్లి పడుకోలేకనా ? ఇంట్లో భార్య, పిల్లలతే కలిసి భోజనం చేయలేక రోడ్డుపక్కన కూర్చుని తింటున్నారా ? ఇంకో ఫొటో చూడండి..తన చేతి చుట్టూ దోమలు చేరి రక్తాన్ని పీల్చేస్తున్నా తట్టుకుంటున్నాడు.

కరోనా వైరస్ సోకిన వారికి తమ ప్రాణాలకు తెగించి వైద్యసేవలందిస్తున్న డాక్టర్లను దేవుళ్లతో కొలుస్తున్నారు. కానీ..లాక్ డౌన్ సమయంలో ప్రజలు పెద్దసంఖ్యలో రోడ్లపై తిరగకూడదని తమ కుటుంబాలను వదిలి రోడ్లపై, చెక్ పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులను కనీసం మనుషుల్లా అయినా చూస్తున్నామా ? నిజానికి పోలీసులు మన మంచి కోసమే ఇంట్లో ఉండండి. బయట తిరగకండి అని చెప్తున్నారు. అక్కడక్కడా కొంతమంది పోలీసులు ఓవర్ గా రియాక్ట్ అయ్యారన్న విషయం పక్కనపెడితే..వేలాది మంది పోలీసులు కనీసం తాము తినే ఖాళీ కూడా లేకుండా శ్రమిస్తున్నారు. స్వచ్ఛంధ సంస్థలో లేక స్థానికులో వారికి భోజనం పెడితే రోడ్డుపైనే కూర్చుని తింటున్నారు. తమ కుటుంబాలకు తమ అవసరం ఎంత ముఖ్యమైనప్పటికీ..ఆ అవసరాన్ని తాము కాకపోతే ఎవరోకరు తీరుస్తారు..మనం ఇక్కడ లేకపోతే ప్రజలను కట్టడి చేసి ఎవరు కాపాడుతారన్న మానవతా దృక్పథంతో, అంచంచలమైన సేవా తత్పరతతో కంటిమీద సరిగ్గా కునుకు లేకుండా విధులు నిర్వహిస్తున్నారు.

Also Read : తెలంగాణకు వర్ష సూచన..జాగ్రత్తగా ఉండండి

ఉదాహరణకు..రెండు మూడ్రోజుల క్రితం విజయవాడలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న శాంతారాం గురించి తెలుసుకునే ఉంటారు. తన తల్లి చనిపోయినప్పటికీ విజయవాడ నుంచి విజయనగరం వెళ్లేందుకు ఆయన ఏమాత్రం ఇష్టపడలేదు. కారణం..తాను అంత్య క్రియలకు వెళ్లాలంటే 4 జిల్లాలు, 40 చెక్ పోస్టులు దాటాల్సి ఉంటుంది. అలా వెళ్తే తనకు దారిమధ్యలో ఎవరి నుంచైనా వైరస్ సోకే ప్రమాదం ఉంది. ఆయన భయం తనకు వైరస్ సోకుతుందని కాదు..తన ద్వారా ఆ వైరస్ ఇంకెంతమందికి వ్యాపిస్తుందోనని..పైగా అంత్యక్రియలకు మూడ్రోజులు, తిరిగి వచ్చాక 14 రోజులు క్వారంటైన్ లో ఉండాలి. అలా ఉండటం వల్ల తాను విధులకు హాజరుకాలేనని, ఇంత క్లిష్టసమయంలో విధులు నిర్వహించకుండా అంత్యక్రియలకు వెళ్తే తన తల్లి ఆత్మశాంతించదని తెలిపారు. అలాగే మచిలీపట్నం సమీపంలోని ఓ గ్రామ రహదారి పక్కన పోలీసులు రోడ్డు పక్కగా కూర్చుని ఆహారం తింటున్న ఫొటో నెట్టింట్లో చక్కర్లు కొట్టింది. వీళ్లు ఇంత కష్టపడేది మనకోసమే కదా..అని ఇంకా కొంతమంది గ్రహించట్లేదు. ఇష్టారాజ్యంగా రోడ్లపై తిరుగుతున్నారు.

Also Read : మా అమ్మ అంత్యక్రియలకు వెళ్తే ఆవిడ ఆత్మ శాంతించదు : ఎస్సై

ప్రజలను కాపాడటం వారి బాధ్యత. కుటుంబం కన్నా ప్రజా శ్రేయస్సే ముఖ్యమనుకుంటున్న పోలీసులను మనం గౌరవిస్తున్నామా ? ఒక్కసారి ఆలోచించండి..వాళ్లు కొట్టారని కోపం పెంచుకోవడం కాదు. సరైన కారణం లేకుండా మనం రోడ్లపై ఎందుకు తిరుగుతున్నాం అని ప్రశ్నించుకోండి. ఇంట్లో ఉండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండని చెప్తున్నా వినకపోతే..వాళ్లూ లాఠీకి పనిచెప్పక తప్పట్లేదు. దయచేసి అనవసరంగా బయట తిరిగి ప్రాణాలమీదికి తెచ్చుకోకండి. పోలీసులను గౌరవిద్దాం. ప్రాణాలు కాపాడుతున్న డాక్టర్లు దేవుళ్లైతే..ప్రాణాలమీదికి రాకుండా కాపాడుతున్న పోలీసులూ దేవుళ్లే..

Next Story