కేసీఆర్‌ను ఆకాశానికెత్తేసిన సాక్షి..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Jun 2020 7:33 AM GMT
కేసీఆర్‌ను ఆకాశానికెత్తేసిన సాక్షి..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ను సాక్షి దిన‌ప‌త్రిక‌ ఉన్నట్లుండి ఆకాశానికెత్తేస్తూ తెలంగాణ ఎడిషన్ ఫస్ట్ పేజీలో ఒక వార్తను ప్రచురించింది. జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సాక్షి.. కేసీఆర్ తెలంగాణ సాధన కోసం చేసిన కృషి గురించి, సీఎం అయ్యాక కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి కోసం, పేదల కోసం, విద్యార్థుల కోసం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథ‌కాల గురించి ప్రస్తావిస్తూ.. కేసీఆరే స్టార్ అనే టైటిల్ తో పొగడ్తల వర్షం కురిపించింది. నిజమే దశాబ్దాల కాలంగా చేసిన కృషి ఫలితమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం. కానీ అది కేసీఆర్ సార్ ఒక్కరి కృషి ఫలితమే కాదు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన వీరులెందరో ఉన్నారు.

ఇక కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధిలో బాటలో పయనిస్తోందన్న విషయం వాస్తవమే. 2016లో టీఆర్ఎస్ చేతికి పాలనా పగ్గాలు రావడంతోనే ప్రభుత్వం సంక్షేమ పథ‌కాలను శరవేగంగా అమలు చేసింది. ఆడపిల్లల కోసం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పథ‌కం కింద వివిధ రంగాలకు చెందిన 32 లక్షల మందికి పెన్షన్లు, తెల్లరేషన్ కార్డున్న ప్రతిఒక్కరికీ 6 కిలోల బియ్యం.. మూడు మతాలకు చెందిన పెద్ద పండుగలకు ప్రభుత్వం తరపున కానుకలు, తెలంగాణ ఆడపడుచులకు ఏటా బతుకమ్మ చీరలు ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఎన్నో రకాల పథ‌కాలను ప్రవేశపెడుతూ బడుగు, బలహీన వర్గాల ప్రశంసలందుకున్నారని రాసుకొచ్చింది సాక్షి.

బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ విద్యార్థుల కోసం 661 రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలు నిర్మించింది ప్రభుత్వం. వీటిలో సగం బాలికలకోసం కేటాయించారు. అలాగే విదేశీ విద్యనభ్యసించేవారికోసం ఓవర్సీస్ స్కాలర్ షిప్ ను ప్రవేశపెట్టింది కేసీఆర్ సర్కార్. అలాగే సాంస్కృతిక, క్రీడా, పర్యాటక రంగాలను కూడా దశలవారిగా అభివృద్ధి చేస్తూ వస్తోంది తెలంగాణ ప్రభుత్వం. కొత్తప్రభుత్వం ఏర్పాటైన తొలి ఏడాది నుంచి తెలుగు మహాసభలు నిర్వహణతో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేసింది.

తెలంగాణలో పర్యాటకానికి కొదువలేదు. ఒక్క భాగ్యనగరంలోనే చూడదగిన ప్రాంతాలెన్నో ఉన్నాయి. తెలంగాణలో ఉన్న చారిత్రాత్మక కట్టడాలు ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలుగా ఉన్నాయి. అవన్నీ కాలగర్భంలో కలిసిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు కేసీఆర్. వరంగల్ కోటను మళ్లీ బాగుచేయించారు. గోల్కొండ కోట వద్దనున్న ఆలయంలో కేసీఆర్ ఏటా బోనాలు పెడుతుంటారు.

రైతన్నల కోసం సంక్షేమ పథ‌కాలను ప్రవేశ పెడుతూ..రైతులకు మరింత దగ్గరయ్యారని ప్రశంసించింది సాక్షి. రైతు బంధు పథ‌కంతో నిజంగానే రైతన్నలకు ఆత్మబంధువయ్యారు. రాష్ట్రంలో ఏ పంట వేస్తే దిగుబడి బాగా వస్తుందో ఎప్పటికప్పుడు సూచనలిస్తూ వచ్చారు కేసీఆర్. ఐటీ, పరిశ్రమలు రంగాల్లో రాష్ట్రం సాధించిన అభివృద్ధితో దేశానికే ఆదర్శంగా నిలిచేంత స్థాయికి ఎదిగింది తెలంగాణ. టీ హబ్, వీ హబ్ ల ద్వారా స్టార్టప్ లకు ప్రోత్సాహాలు అందించింది. అలాగే టీపాస్ ఐ పాస్ ద్వారా ఈ ఏడాది జనవరి నాటికి రెండు లక్షల నాలుగు వేల కోట్ల పారిశ్రామికి పెట్టుబడులొచ్చాయి రాష్ట్రానికి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. రాష్ట్రం కోసం కేసీఆర్ సర్కార్ చేసిన కృషి మాటల్లో చెప్పుకోదగ్గది కాదు.

నా తెలంగాణ - కోటి రతనాల వీణ.. దిశగా కేసీఆర్ పాలన సాగిపోతోంది. కేసీఆర్ కలలు గన్న రాష్ట్రం తెలంగాణ. ఈ తెలంగాణ మరింత అభివృద్ధి దిశగా దూసుకెళ్తూ.. దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా నిలవాలని ఆశిస్తూ.. న్యూస్ మీటర్ పాఠకులకు తెలంగాణ రాఫ్ట్ర 6వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.

Next Story