షిర్డీ బంద్‌.. సాయి సంస్థాన్‌ ట్రస్ట్‌తో మహారాష్ట్ర ప్రభుత్వం చర్చలు.!

By అంజి  Published on  19 Jan 2020 9:32 AM GMT
షిర్డీ బంద్‌.. సాయి సంస్థాన్‌ ట్రస్ట్‌తో మహారాష్ట్ర ప్రభుత్వం చర్చలు.!

షిర్డీ: సాయి జన్మభూమి వివాదంపై మహారాష్ట్రలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం కాస్తా వెనక్కు తగ్గినట్టుగా కనిపిస్తోంది. తాజాగా రేపు షిర్డీ సాయి సంస్థాన్‌ ట్రస్ట్‌తో మహారాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపేందుకు ఓకే చెప్పింది. ట్రస్ట్‌ సభ్యులను మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ థాక్రే చర్చలకు ఆహ్వానించారు. పత్రీ పేరుతో భక్తి వికేంద్రీకరణ చేస్తే షిర్డీ ప్రాధాన్యత తగ్గుతుందని ట్రస్ట్‌ నిర్వహకులు అంటున్నారు. షిర్డీకే మొదట ప్రాధాన్యం ఇవ్వాలని సాయి సంస్థాన్‌ ట్రస్ట్‌ అంటోంది. కాగా షీర్డి సహా పలు గ్రామాల్లో ఉదయం నుండి బంద్‌ కొనసాగుతోంది.

ఇటీవల పత్రియే సాయి జన్మస్థలమని శివసేన సర్కార్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. పత్రీ గ్రామ అభివృద్ధికి సీఎం ఉద్ధవ్‌ థాక్రే ఆకస్మాత్తుగా రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సాయి భక్తులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పత్రిని సాయి జన్మస్థలం అని ప్రకటిస్తే సహించేది లేదని షిర్డీ వాసులు తేల్చి చెబుతున్నారు. కాగా సర్కార్‌ తీరును నిరసిస్తూ గ్రామస్తులు షిర్డీ బంద్‌కు పిలుపునిచ్చారు. ఆలయం మూసివేస్తామని హెచ్చరికలు కూడా చేశారు. శివసేన చర్యలపై షిర్డీలో సాయి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సాయి భక్తులు ఆందోళనలో ఉన్నారు. పత్రీ సాయి జన్మస్థలం అని నమ్మకం తప్ప ఆధారామేంటని భక్తులు అంటున్నారు.

పత్రిలోనే సాయి పుట్టారని స్థానికులు నమ్ముతూ ఉంటారు. 1999 నుంచి సాయిబాబాకు గుడికట్టి భక్తులు పూజిస్తున్నారు. బాబా ఆలయం తెరిచే ఉంటుందని, భక్తుల దర్శనాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని సాయి ట్రస్ట్‌ ప్రకటించింది. భక్తులకు ఇబ్బంది లేకుండా స్థానికులు షిర్డీ బంద్‌కు పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో ప్రభుత్వం దిగొచ్చే వరకు షిర్డీలో నిరసనలు తెలుపుతామని స్థానికులు అంటున్నారు.

Next Story