సాయి జన్మభూమిపై వివాదం.. రేపు షిర్డీ బంద్‌..!

By అంజి  Published on  18 Jan 2020 10:28 AM GMT
సాయి జన్మభూమిపై వివాదం.. రేపు షిర్డీ బంద్‌..!

ముఖ్యాంశాలు

  • పత్రి.. సాయి జన్మస్థలమంటున్న శివసేన సర్కార్‌
  • ఆలయం మూసివేత ప్రచారాన్ని ఖండించిన ట్రస్ట్‌
  • షిర్డీకే ప్రాధాన్యం ఇవ్వాలంటున్న సాయి సంస్థాన్‌ ట్రస్ట్‌

ముంబై: సాయి సమాధి మందిరం షిర్డీ.. మరి జన్మస్థలం ఎక్కడ అంటూ..? అన్నది మహారాష్ట్రలో హాట్‌టాఫిక్‌గా మారింది. పత్రియే సాయి జన్మస్థలమని శివసేన సర్కార్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. పత్రీ గ్రామ అభివృద్ధికి సీఎం ఉద్ధవ్‌ థాక్రే ఆకస్మాత్తుగా రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సాయి భక్తులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పత్రిని సాయి జన్మస్థలం అని ప్రకటిస్తే సహించేది లేదని షిర్డీ వాసులు తేల్చి చెబుతున్నారు. కాగా సర్కార్‌ తీరును నిరసిస్తూ గ్రామస్తులు షిర్డీ బంద్‌కు పిలుపునిచ్చారు. రేపటి నుంచి ఆలయం మూసివేస్తామని హెచ్చరికలు కూడా చేశారు. శివసేన చర్యలపై షిర్డీలో సాయి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సాయి భక్తులు ఆందోళనలో ఉన్నారు. పత్రీ సాయి జన్మస్థలం అని నమ్మకం తప్ప ఆధారామేంటని భక్తులు అంటున్నారు. పత్రిలోనే సాయి పుట్టారని స్థానికులు నమ్ముతూ ఉంటారు. 1999 నుంచి సాయిబాబాకు గుడికట్టి భక్తులు పూజిస్తున్నారు.

షిర్డీ ప్రయాణాన్ని రద్దు చేసుకునే యోచనలో భక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. పత్రీ పేరుతో భక్తి వికేంద్రీకరణ చేస్తే షిర్డీ ప్రాధాన్యత తగ్గుతుందని ట్రస్ట్‌ నిర్వహకులు అంటున్నారు. షిర్డీకే మొదట ప్రాధాన్యం ఇవ్వాలని సాయి సంస్థాన్‌ ట్రస్ట్‌ అంటోంది. మహారాష్ట్రలో మహావికాస్‌ అఘాడీ సర్కార్‌ అధికారంలోకి వచ్చాక రోజుకో వివాదం తెరపైకి వస్తోంది. వీర సావర్కర్‌ వివాదం మరువక ముందే.. ఇప్పుడు సాయి జన్మ స్థలంపై వివాదం రాజుకుంటోంది. పత్రీకి షిర్డీకి మధ్య 280 కిలోమీటర్ల దూరం ఉంది. త్వరలోనే షిర్డీకి సీఎం ఉద్ధవ్ థాక్రే వెళ్తారని శివసేన నేతలు తెలిపారు. పత్రీ గ్రామాభివృద్ధిపై షీర్డీ ప్రజలతో కూలంకషంగా చర్చిస్తారని వెల్లడించారు. ఈ రెండు క్షేత్రాలు కూడా ఆధ్యాత్మిక కేంద్రాలుగా మహారాష్ట్రలో విరాజిల్లుతాయన్నారు.

ఆలయం మూసివేత ప్రచారాన్ని ట్రస్ట్‌ ఖండించింది. ఈ వివాదం కారణంగా ఆలయాన్ని మూసివేయమని, దర్శనాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని షిర్డీ సాయి సంస్థాన్‌ ట్రస్ట్‌ సభ్యుడు డా.ఏక్‌నాథ్‌ గోవింద్‌ర్‌ ప్రముఖ ఛానెల్‌కు తెలిపారు. భక్తులు ప్రయాణాన్ని మానుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎన్ని ఆలయాలున్న షిర్డీ ప్రాముఖ్యత షిర్డీదేనని ట్రస్ట్‌ తెలిపింది. అయితే అక్కడి బీజేపీ మాత్రం షిర్డీనే సాయి నివాసమంటోంది. సర్కార్‌ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. షిర్డీ ప్రాముఖ్యతను తగ్గిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

Next Story