ఢిల్లీ: కరోనాపై పోరు నేపథ్యంలో సార్క్‌ దేశాలకు భారత్‌ పిలుపునిచ్చిన విషయం తెలిసింది. అయితే ఈ విషయంలో శత్రుదేశం పాకిస్తాన్‌ మరో తన వక్రబుద్దిని ప్రదర్శించింది. అత్యవసర నిధిని ఏర్పాటు చేయాలంటూ తీసుకువచ్చిన భారత్‌ ప్రతిపాదనకు పాకిస్తాన్‌ మొండి చేయి చూపించింది. అత్యవసరం నిధికి పాకిస్తాన్‌ ఎలాంటి సాయం చేయలేదు. ఇటీవల జరిగిన సార్క్‌ దేశాల సమావేశంలోనూ పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పాల్గొనలేదు. కరోనా వైరస్‌ తన ప్రతాపాన్ని ప్రపంచంపై చూపిస్తున్న క్రమంలో తాను ఇచ్చిన పిలుపుకు మద్దతు తెలిపిన దేశాలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే అత్యవసర నిధికి భారత్‌ తరఫున కోటి డాలర్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కరోనాపై యుద్ధం చేసేందుకు కలిసి నడవాలని సార్క్‌ కూటమి దేశాలు నిర్ణయించుకున్నాయి.

Also Read: భారత్‌కు తోడుంటాం: చైనా

కరోనాను కట్టడి చేసేందుకు గత ఆదివారం నాడు సార్క్‌ దేశాల నేతలు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో అత్యవసర నిధిని ఏర్పాటు చేయాలన్న ప్రధాని మోదీ ప్రతిపాదనను సభ్య దేశాలు అంగీకరించాయి. ఇతర సభ్య దేశాలు కూడా స్వచ్ఛందంగా విరాళాలు ప్రకటించాలని ప్రధాని మోదీ అన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు భారత్‌లో యుద్ధ ప్రతిపాదికన అన్ని రకాల చర్యలు చేపట్టామని తెలిపారు. కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్స చేసేందుకు అన్ని రకాల కిట్స్‌ను అందుబాటులో ఉంచామన్నారు. అవసరమైతే సార్క్‌ సభ్య దేశాలకు కూడా వాటిని ఇస్తామని మోదీ చెప్పారు.

10 మిలియన్‌ డాలర్ల నిధిని ఏర్పాటు చేసి దానిని కరోనాపై పోరాడేందుకు వినియోగిద్దామని ఆయన సార్క్‌ దేశాలను కోరారు. ఇప్పటికే బంగ్లాదేశ్‌, శ్రీలంక, నేపాల్‌, అప్ఘానిస్తాన్‌, మాల్దీవులు దేశాలు తమ వంతు సహాయనిధిని సమకూర్చాయి. సార్క్‌ దేశాల్లో ఒకటైన భూటాన్‌ దేశం కరోనా వైరస్‌ అత్యవసర నిధికి దూరంగా ఉంది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.