రష్యా వ్యాక్సిన్‌పై మిశ్రమ స్పందన

By మధుసూదనరావు రామదుర్గం  Published on  13 Aug 2020 1:54 PM IST
రష్యా వ్యాక్సిన్‌పై మిశ్రమ స్పందన

కరోనా టీకా వచ్చేసిందోచ్‌ అంటూ రష్యా ప్రకటించేసింది. ఈ వ్యాక్సిన్‌ రేస్‌లో తాము తిరుగులేని విజయం సాధించినట్లు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించారు. అయితే ఈ వ్యాక్సిన్‌పై ప్రపంచదేశాలు మిశ్రమంగా స్పందిస్తున్నాయి. కరోనా చీకట్లు కమ్మేస్తున్న వేళ ఇదో వెలుగు రేఖ అనుకున్నా.. దీని ఫలితాలపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయాలంటే చాలా తతంగం ఉంటుంది. ఎంత లేదన్నా సంవత్సరాల సమయం పడుతుంది. అలాంటిది రెండు నెలల్లోనే వచ్చిందంటే...దాని వాడకంలో భద్రతపై సందేహాలున్నాయని సైంటిస్టుల వ్యాఖ్య! మరి ఇంతకూ రష్యా టీకా విజయవంతమైతే మానవాళికి ఇదో గొప్ప శుభవార్తే!!

అంతకంతకూ విజృంభిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు ఒక వ్యాక్సిన్‌ అవసనం ఉంది. పలు దేశాలు పరిశోధనలో నిమగ్నమై ఉన్నాయి. మొదట్లో అమెరికా ఇదిగో వచ్చేసింది వ్యాక్సిన్‌ అంటున్నా..

దానికింకా చాలా సమయం పట్టేలా ఉంది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ.. సిరమ్‌ కంపెనీ సంయుక్తంగా చేపట్టిన వాక్సిన్‌ ప్రయోగం మలిదశకు చేరుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రష్యా తమ శోధన ఫలించిందనీ.. వ్యాక్సిన్‌ వచ్చేసిందని ప్రపంచానికి చెప్పేసింది. కరోనాపై యుద్ధంలో రష్యా విజయం సాధించిందని, వ్యాక్సిన్‌ రేసులో తమ దేశం అగ్రస్థానంలో ఉందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించారు. అంతేకాదు ఆయన కుమార్తెపై టీకా ప్రయోగించారు. వైరస్‌ నిరోధానికి తాము అభివృద్ధి చేసిన యాంటీ వైరస్‌ స్పుత్నిక్‌–ఠి అద్భుతంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు.

తన కుమార్తె టీకా వేసుకున్నప్పుడు శరీర ఉష్టోగ్రత 100.4 ఫారెన్‌ హీట్‌కు పెరిగిందని తెలిపారు. అయితే ఒక రోజు తర్వాత తగ్గిందన్నారు. రెండో డోసు వేసుకుంటే మళ్ళీ ఉష్టోగ్రత పెరిగి తగ్గుతుందని.. ఆ తర్వాత ఇక భయపడాల్సిన అవసరమే లేదని తెలిపారు. అయితే ప్రపంచదేశాల సైంటిస్టులు.. ఈ టీకా సామర్థ్యం పై పలు అనుమానాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మానవ ప్రయోగాలు వాటి ఫలితాలను పూర్తి స్థాయిలో రష్యా ప్రకటించలేదని అంటున్నారు. తుది విడత పరీక్షలు పూర్తి కాకముందే దీనికి అనుమతులు ఇవ్వడంతో భద్రతా ప్రమాణాలు సరిగా ఉన్నాయో లేవో అని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు.

1957లో సోవియట్‌ యూనియన్‌ ప్రయోగించిన తొలి ఉపగ్రహం పేరుపై ఈ టీకాకు స్పుత్నిక్‌–వి అని నామకరణం చేశారు. స్పుత్నిక్‌–వి టీకాను గమేలియా పరిశోధన సంస్థ బీవో ఫార్మ్‌ ఉత్పత్తి చేస్తాయని రష్యా ఆరోగ్యశాఖ మంత్రి మిఖాయిల్‌ మురాష్కో తెలిపారు. టీకాను షరతులతోనే రిజిస్టర్‌ చేసినట్లు ఆయన చెప్పారు. తొలుత ఈ టీకాను దేశంలోని డాక్టర్లు టీచర్లకు ఇస్తున్నట్లు వివరించారు.2021 జనవరి 1 నుంచి ఈ టీకా ప్రజలకు అందుబాటులో వస్తుందని రష్యా స్టేట్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్స్‌ వెబ్‌సైట్‌లో ప్రకటించింది.

రెండేళ్ల దాకా కరోనా నుంచి రక్షిస్తుందంటున్న ఈ టీకాను అడినోవైరస్‌ ఆధారంగా అభివృద్ధి చేసినట్లు గమాలెయా జాతీయ పరిశోధనా కేంద్రం డైరెక్టర్‌ తెలిపారు. స్పుత్నిక్‌–వి పై జూన్‌ 18న క్లినికల్‌ ప్రయోగాలు ప్రారంభించారు. తొలుత 36 వలంటీర్లపై ప్రయోగించారు. వారిలో కరోనా నిరోధక శక్తి పెరిగిందని తెలిపారు. వ్యాక్సిన్‌ ప్రయోగించిన మొదటి బ్యాచిని జులై 15న రెండో బ్యాచిని అదే నెల 20న డిశ్చార్జి చేశారు.

అయితే రష్యా ఇలా టీకాను హడావుడిగా తీసుకురావడం సరికాదని అంతర్జాతీయ నిపుణులంటున్నారు. ఏ టీకాకైనా క్లినికల్‌ ప్రయోగా ఫలితాలే ప్రామాణికాలని, ఎంత ఎక్కువమందికి ఇవ్వాలని, వచ్చిన ఫలితాలను.. వాటిలో వైరుధ్యాలను అధ్యయనం చేస్తూ సరిదిద్దాలనేది వారి వాదన. ఇలా ఓ వైపు ప్రయోగ దశలో ఉండగానే ఉత్పత్తి ప్రారంభించడం అంత శ్రేయస్కరం కాదని. వ్యాక్సిన్‌ వృద్ధి సమయాన్ని కుదించడం ఎంతవరకు సబబని వారంటున్నారు.

అమెరికాలోని అంటువ్యాధి నిపుణుడు ఆంటోనీ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. రష్యా,చైనాలు టీకాపై సరైన ప్రయోగాలే చేస్తున్నాయని అనుకుంటున్నా. కానీ ఇంతత్వరగా వ్యాక్సిన్‌ను మార్కెట్లో తీసుకురావడం పలు సమస్యలకు దారితీయవచ్చు అని అంటున్నారు.

ఒకవైపు విమర్శలు వెల్లువెత్తుతుంటే.. స్పుత్నిక్‌ టీకా కోసం లాటిన్‌ అమెరికా, పశ్చిమాసియా తదితర దేశాల నుంచి తమకూ కావాలంటూ వినతులు వస్తున్నట్లు తెలుస్తోంది. రష్యా టీకాను మొదట నేనే స్వీకరిస్తానని ఫిలిప్పీన్‌ అధ్యక్షుడు ప్రకటించడం గమనార్హం. కోవిడ్‌–19 పై రష్యా తయారు చేసిన వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌–వి విజయవంతమైతే ప్రజలు అదృష్టవంతులేనని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర బయాలజీ (సీసీఎంబి) డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా అన్నారు.

టీకా సామర్థ్యం, పనితీరు ఇంకా తేలకముందే అది బాగుందనో బాగాలేదనో ఎలా చెప్పగలమని అన్నారు. ఈ టీకా వేశాక వైరల్‌ ఇన్ఫెక్షన్‌ వస్తుందో లేదో రెండునెలల దాకా వేచి చూడాల్సి ఉంటుందన్నారు. సాధారణంగా ఏ వ్యాక్సిన్‌ అయినా మూడు దశల్లో సత్పలితాలిస్తేనే అది సమర్థంగా పనిచేసినట్లు లెక్క అని వ్యాఖ్యానించారు. కానీ టీకాను వేగవంతంగా పూర్తి చేసేందుకు రష్యా ఏకంగా చట్టాన్నే తీసుకురావడాన్ని గుర్తుచేస్తున్నారు.

విమర్శల మాట ఎలా ఉన్నా.. రష్యా మాత్రం టీకా తయారీలో ముందడుగు వేసినట్టే. సత్పలితాలు వస్తే.. ఇక ప్రపంచ దేశాలు క్యూ కట్టడం ఖాయం.

Next Story