ఎన్టీఆర్ బాటలోనే వైఎస్ జగన్ ప్రయాణిస్తారా.?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Jan 2020 6:05 AM GMT
ఎన్టీఆర్ బాటలోనే వైఎస్ జగన్ ప్రయాణిస్తారా.?

చట్టసభల నియమావళిలోని 71 వ నిబంధనను అడ్డం పెట్టుకుని మూడు రాజధానుల బిల్లును శాసనమండలిలో అడ్డుకోవడం ద్వారా విపక్ష తెలుగుదేశం తన గొయ్యిని తానే తవ్వుకుందా? కేవలం సంఖ్యా బలంలో బిల్లు చట్టంగా మారడాన్ని ఆలస్యం చేయగలడం తప్ప తెదేపా ఇంకేమీ చేయలేదు. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం రెండు మార్లు మాత్రమే బిల్లును తిప్పి పంపే అధికారం శాసన మండలికి ఉంది. ఆ తరువాత మండలి ప్రమేయం లేకుండానే బిల్లు చట్టం అవుతుంది. కాబట్టి శాసన మండలిలో అడ్డుకుని, తెదేపా చేస్తున్న విజయహాసం తాత్కాలికమే.

అయితే పదే పదే ఇలా అన్ని బిల్లులను అడ్డుకునే ప్రయత్నం టీడీపీ చేయబోతోందన్న విషయం సులువుగానే అర్థం అవుతుంది. ఇంతకు ముందు షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలకు వేర్వేరు కమిషన్ల ఏర్పాటుకు సంబంధించిన బిల్లు విషయంలోనూ ఇదే రకంగా తెదేపా శాసన మండలిలో అడ్డుపుల్ల వేసింది. ప్రభుత్వ విద్యాలయాల్లో ఇంగ్లీష్ మీడియం బోధనను అడ్డుకునేందుకు కూడా ఇదే సైంధవ పాత్రను తెదేపా పోషించింది. వీటి వల్ల బిల్లు చట్టంగా మారడంలో తీవ్రమైన జాప్యం జరిగింది. కాబట్టి ఇక ముందు కూడా తెదెపా ఇలాగే సైంధవ, సంశప్తక పాత్రను పోషిస్తుందన్న అనుమానాలు వైకాపా వర్గాల్లో వ్యక్తమౌతున్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి శాసన మండలిని రద్దు చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

ఎందుకంటే భారత రాజ్యాంగంలోని 169వ అధికరణ ప్రకారం శాసనమండలిని ఏర్పాటు చేయాలన్నా, రద్దు చేయాలన్నా ఆ రాష్ట్ర శాసనసభ తీర్మానం చేయాలి. ఆ తీర్మానాన్ని పార్లమెంటు ఉభయ సభలు ఆమోదిస్తే మండలి రద్దు చేయవచ్చు. ఇదే విధానంతో మళ్లీ మనుగడలోకి కూడా తేవచ్చు. ఇప్పటికే పలువురు రాజ్యాంగ నిపుణులు శాసనమండలిని ఆరవ వేలిగా అభివర్ణిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో శాసన మండలి ఇప్పటికే రద్దయింది.

మరో సమస్య ఏమిటంటే ‘రూల్‌–71 కింద చర్చకు అనుమతిస్తే ఇది క్రమేపీ ఒక సంప్రదాయంగా మారిపోతుంది. ప్రతి బిల్లును ఇదే పద్ధతిలో అడ్డుకోవడం జరుగుతుందన్నది సుస్పష్టం. రూల్ 71 మేరకు విపక్షం ఏదైనా ఒక విషయంపై తన అభ్యంతరాన్ని లేదా అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ చైర్మన్ కు నోటీసులు ఇవ్వాలి. ఆ తరువాత చర్చ జరగాలి. చర్చ అనంతరం వోటింగ్ జరుగుతుంది. వోటింగ్ లో బిల్లును ఆమోదించడం లేదా తిరస్కరించడం జరుగుతుంది. ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి శాసన మండలిని రద్దు చేయమని జగన్మోహన్ రెడ్డి సిఫార్సు చేసే అవకాశం ఉంది. నిజానికి 1983 లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన బిల్లులను కాంగ్రెస్ పార్టీ శాసన మండలిలో అడ్డుకునేది. దానికి తోడు అప్పటి విపక్షసభ్యులు రోశయ్య, జూపూడి యజ్ఞనారాయణ, జైపాల్ రెడ్డిలను తట్టుకోవడం ఎన్టీఆర్ వల్ల కాలేదు. దానితో ఆయన శాసన మండలిని రద్దు చేసేశారు. ఆ తరువాత మళ్లీ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత శాసన మండలిని పునరుద్ధరించడం జరిగింది. కాబట్టి జగన్ ఎన్టీఆర్ బాటనే అనుసరించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Next Story