ఆ పథకానికి ‘జగనన్న గోరుముద్ద’గా నామకరణం

By Newsmeter.Network  Published on  21 Jan 2020 1:45 PM GMT
ఆ పథకానికి ‘జగనన్న గోరుముద్ద’గా నామకరణం

అమరావతి : పేదలకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. పిల్లలకు మనం ఇవ్వగలిగే గొప్ప ఆస్తి చదువేనని అన్నారు. విద్యారంగంలో గొప్ప మార్పులు తీసుకొస్తూ చేపడుతున్న కార్యక్రమమే అమ్మఒడి అని ఆయన తెలిపారు. అసెంబ్లీలో అమ్మ ఒడి, మధ్యాహ్న భోజనం తదితర అంశాలపై జరిగిన చర్చలో సీఎం మాట్లాడారు. 82 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును మార్చేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో వారి చదువు ఆగకూడదనే ఉద్దేశంతోనే తల్లిదండ్రులకు సాయం అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో రూ.6,028 కోట్లు జమ చేశామని, అర్హులై సాంకేతిక కారణాలతో లబ్ది పొందని మిగతా తల్లులకు వెంటనే ఈ పథకాన్ని వర్తింపజేస్తామని పేర్కొన్నారు.

విద్యార్థులకు నాణ్యమైన పుష్టికరమైన ఆహారాన్ని అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇందుకోసం మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు చేసి సరికొత్త మెనూను రూపొందించామన్నారు. ఈ పథకానికి ‘జగనన్న గోరుముద్ద’గా కొత్త పేరు పెట్టినట్లు ప్రకటించారు. కొత్త మెనూ ఈ రోజు నుంచి అమలు చేస్తున్నామని తెలిపారు.

మధ్యాహ్నం భోజన పథకం ఆయాలకు ఇచ్చే గౌరవ వేతనాన్ని కూడా రూ.వెయ్యి నుంచి రూ.3వేలకు పెంచామన్నారు. దీంతో ప్రభుత్వానికి రూ.344 కోట్ల అదనపు భారం పడనుందని చెప్పారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యతను పెంచేందుకు నాలుగంచెల వ్యవస్థను తెస్తున్నామని చెప్పారు. పాఠశాల అభివృద్ధి కమిటీ నుంచి ముగ్గురు సభ్యులకు పర్యవేక్షణ బాధ్యత అప్పగించనున్నట్లు తెలిపారు. వీరితో పాటు వార్డు, గ్రామ సచివాలయంలో ఉండే విద్య, సంక్షేమ అధికారి నాణ్యతను పరిశీలించేలా చేస్తామన్నారు. వీరందరిపై ఆర్డీవో స్థాయి అధికారి పర్యవేక్షణ ఉంటుందన్నారు.

జగనన్న గోరుముద్ద మెనూ..

సోమవారం - అన్నం, పప్పుచారు, ఎగ్‌ కర్రీ, స్వీటు, చిక్కీ

మంగళవారం - పులిహోర, టొమాటో పప్పు, ఉడికించిన గుడ్డు

బుధవారం- వెజిటబుల్‌ రైస్‌, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, స్వీట్‌, చిక్కీ

గురువారం కిచిడీ, టొమాటో చట్నీ, ఉడికించిన గుడ్డు

శుక్రవారం- అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, స్వీట్‌, చిక్కీ

శనివారం- అన్నం, సాంబారు, స్వీట్‌ పొంగల్‌

Next Story