హైదరాబాద్‌లో ఆర్‌ఎస్‌ఎస్ బహిరంగ సభ..!
By అంజి Published on 25 Dec 2019 11:56 AM ISTహైదరాబాద్‌లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) విజయ సంకల్ప పేరుతో మూడు రోజుల శిక్షణ శిబిరం నిర్వహిస్తోంది. ఈ శిబిరానికి పెద్ద సంఖ్యలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు హాజరయ్యారు. దేశభక్తి, హిందూ ధర్మం తదితర అంశాలతో పాటు గ్రామాల్లోకి ఆర్‌ఎస్‌ఎస్‌ను తీసుకెళ్లేందుకు కార్యచరణపై శిక్షణ శిబిరంలో చర్చిస్తున్నారు. మంగళపల్లిలోని భారత్ ఇంజినీరింగ్ కాలేజీలో మంగళవారం నాడు ఆర్‌ఎస్‌ఎస్ శిక్షణ శిబిరం ప్రారంభమైంది. 2025 నాటికి ఆర్‌ఎస్‌ఎస్‌ను స్థాపించి వందేళ్లు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని 10 వేల గ్రామాలకు సంఘ్‌ను విస్తరించాలనే ఉద్దేశంతోనే శిక్షణ శిబిరం చేపట్టారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను 1925 సంవత్సరం సెప్టెంబర్ 27న డాక్టర్ కేశవరావ్ బలీరామ్ పంత్ హెడ్గేవార్ స్థాపించారు.
శిక్షణ కార్యక్రమంలో సంఘ్ కార్యకర్తలు తెలుపు, ఖాకీ రంగు దుస్తులు ధరించి కర్రలతో సందడి చేశారు. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలతో పాటు ఏబీవీపీ, కిసాన్ సంఘ్, బీజేపీకి చెందిన దాదాపు 8 వేల మంది కార్యకర్తలు హాజరయ్యారు. క్షేత్ర కార్యనిర్వహక అధ్యక్షుడు దూసరి రామకృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు దక్షిణామూర్తి, జాతీయ స్థాయి అధికారులు భాగయ్య, ముకుందాజీలు కార్యకర్తలకు మార్గ నిర్దేశనం చేస్తున్నారు. మంగళవారం నాడు సాయంత్రం ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ శిక్షణ శిబిరానికి హజరయ్యారు. ఈ శిబిరంలో మొదటి రోజున ప్రముఖులు ఎంపీ బండి సంజయ్, బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర బీజేపీ చీఫ్ లక్ష్మణ్, గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పాల్గొన్నారు.
దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ ఆలెక్ శ్యామ్ కుమార్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసింగించారు. హిందూ సమాజాన్ని జాగృతం చేసేందుకు ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండాలన్నారు. ఇక్కడి సంప్రదాయాన్ని హిందు సంప్రదాయంగా, ధర్మం, సంస్కృతిని హిందూ ధర్మం, సంస్కృతిగా భావించేవారు అందరూ హిందువులేనన్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు సరూర్‌నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ జరగనుంది. ముఖ్య అతిథిగా బీవీఆర్ మోహనర్‌రెడ్డి హాజరుకానున్నారు. ఈ సభలో ఆర్ఎస్‌స్ చీఫ్ మోహన్ భగవత్ ప్రసంగించనున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ భారీ సభ ఏర్పాటు చేయడంతో రాచకొండ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు.