నెహ్రూ జూపార్కులో బెంగాల్‌ టైగర్‌ కిర‌ణ్ మృతి..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Jun 2020 12:35 PM IST
నెహ్రూ జూపార్కులో బెంగాల్‌ టైగర్‌ కిర‌ణ్ మృతి..

హైదరాబాద్‌లోని బహదూర్‌పురా నెహ్రూ జూలాజికల్‌ పార్కులో విషాదం చోటు చేసుకుంది. తెల్లరంగు రాయల్‌ బెంగాల్‌ టైగర్‌(కిరణ్‌-8) మృతిచెందింది. కుడివైపు దవడ భాగంలో ఏర్పడిన న్యూమో ప్లాస్టిక్‌ కణితితో బాధపడుతూ 8 సంవత్సరాల కిరణ్‌ మృతి చెందింది. నెహ్రూ జూలాజికల్‌ పార్కు అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. కిరణ్‌ ఇదే పార్కులో పుట్టిందని, కుడి దవడ భాగంలో ఏర్పడిన న్యూమోప్లాస్టిక్‌ కణితి కారణంగా అనారోగ్యం పాలైందన్నారు. గత కొన్ని రోజులుగా చికిత్స అందిస్తున్నామన్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి గురువారం చనిపోయిందని తెలిపారు. మృతి చెందిన పులికి వెటర్నరీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వ‌హించారు.

కిరణ్‌ తండ్రి బద్రి కూడా ట్యూమర్‌తో బాధపడుతూ కొన్నేళ్ల క్రితం మృతి చెందింది. కిర‌ణ్‌ తాత రుద్ర 12 ఏండ్ల‌ వయసులో ఇదే వ్యాధితో మృతి చెందింది. ఇప్పుడు కిరణ్‌ కూడా అదే వ్యాధితో మృతి చెందడంతో వైద్యులు శాంపిళ్లు సేకరించి ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. కాగా, జూపార్కుకే వన్నెతెచ్చే రాయల్‌ బెంగాల్‌ టైగర్లు ఒకేర‌క‌మైన‌ ట్యూమర్‌ వ్యాధితో మృతిచెందుతుండటం ఆందోళనకు గురి చేస్తోంద‌ని చేస్తొంది.

Next Story