2 నిమిషాల్లో రోహిత్ 26 సిక్సర్లు.. వీడియో వైరల్
By తోట వంశీ కుమార్ Published on 12 Jun 2020 11:26 AM ISTకరోనా మహమ్మారి కారణంగా క్రీడలు అన్ని నిలిచిపోయాయి. లాక్‌డౌన్ కారణంగా క్రీడాకారులంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. తమకు దొరికిన ఈ విరామాన్ని ఆటగాళ్లు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతున్నారు. ఇక హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అయితే.. సోషల్ మీడియా యమా యాక్టివ్‌గా ఉంటున్నాడు. అభిమానులతో లైవ్ చిట్ చాట్‌లు నిర్వహిస్తూ.. పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం క్రికెట్ లేకపోవడంతో తాను ఒక విషయాన్ని బాగా మిస్ అవుతున్నట్లు చెప్పాడు. ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోను పోస్టు చేసిన హిట్ మ్యాన్ సిక్సులు కొట్టడానికి కుదరటం లేదన్నాడు.
గతంలో తాను కొట్టిన సిక్సర్ల వీడియోను పోస్టు చేసి.. 'ఇలా చేయడాన్ని మిస్సవుతున్నా' అంటూ ఆ వీడియోకి క్యాప్షన్ రాశాడు. 2 నిమిషాల ఒక సెకను ఉన్న ఈ వీడియోలో ఏకంగా 26 సిక్సర్లు ఉండటం విశేషం. రోహిత్ శర్మ సిక్సర్లను చాలా సులువుగా కొడతాడు. బంతిని ముద్దాడినట్లే ఉన్నా కానీ మైదానం ఆవల బంతి ఉంటుంది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు రోహిత్ శర్మ సిక్సర్లను మేము కూడా మిస్ అవుతున్నామని తెగ కామెంట్లు చేస్తున్నారు.
ఇక రోహిత్ క్రికెట్ ఆడి నాలుగు నెలలకు పైగానే కావొస్తుంది. ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్ పర్యటనలో రోహిత్ గాయపడ్డాడు. దీంతో ఈ సుదీర్ఘ పర్యటన మధ్యలోంచి ఇంటికి వచ్చాడు. అప్పటి నుంచి ఇంటికే పరిమితం అయ్యాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అయినా రోహిత్ సిక్సర్లను చూడవచ్చు అనుకున్న ప్రేక్షకులకు నిరాశ తప్పలేదు. ఐపీఎల్-13వ సీజన్ కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.