ఐపీఎల్‌2020కి సిద్దంగా ఉండండి.. సౌరవ్‌ గంగూలి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Jun 2020 6:35 AM GMT
ఐపీఎల్‌2020కి  సిద్దంగా ఉండండి.. సౌరవ్‌ గంగూలి

కరోనా మహమ్మారి కారణంగా మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్) నిరవధికంగా వాయిదా పడింది. ఎప్పుడు ప్రారంభమవుతుంది.? అసలు ఈ ఏడాది ఐపీఎల్‌ ఉంటుందా? అన్న అనుమానాలకు తెరదించాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలి.

ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌ 15 నుంచి టీ20 ప్రపంచ కప్‌ జరగనుంది. అయితే.. కరోనా కారణంగా టీ20 ప్రపంచకప్‌కు నిర్వహించాలా లేదా వాయిదా వేయాలా అన్న దానిపై అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) బుధవారం సభ్య దేశాలతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించింది. సుమారు మూడు గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో ఎటువంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. 'టీ20 ప్రపంచకప్‌ టోర్నమెంట్‌పై మేం సరైన నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకోవడానికి ఒక్క అవకాశమే ఉంటుంది. అందుకే అది మంచి నిర్ణయమై ఉండాలి. మా సభ్య దేశాలు, ప్రసారదారు, భాగస్వాములు, ప్రభుత్వాలు, ఆటగాళ్లతో సంప్రదింపులను కొనసాగిస్తాం. పూర్తి అవగాహనతో నిర్ణయం తీసుకుంటాం' అని ఐసీసీ ముఖ్యకార్యనిర్వహణ అధికారి మను సాహ్ని ఓ ప్రకటనలో తెలిపాడు.

ప్రపంచకప్‌ పై ఐసీసీ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఆ సమయంలో ఐపీఎల్‌ను నిర్వహించేందుకు బీసీసీఐ రెడీ అవుతోంది. ఐపీఎల్‌కు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర అసోసియేషన్ లకు సౌరవ్‌ గంగూలి లేఖ రాశాడు. కరోనా వ్యాప్తి తగ్గగానే ఐపీఎల్‌ను నిర్వహిస్తామని, ఈ మేరకు సిద్దంగా ఉండాలన్నారు. ప్రేక్షకులు లేకుండానే ఖాళీ స్టేడియంలోనూ నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నామన్నాడు. భారత క్రికెటర్లు మాత్రమే కాకుండా విదేశీ క్రికెటర్లు కూడా టోర్నీలో ఆడేందుకు సిద్దంగా ఉన్నారని, ఆటగాళ్ల ఆరోగ్యమే తమ తొలి ప్రాధాన్యమన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ ఖచ్చితంగా జరుగుతుందని స్పష్టం చేశాడు. సాధ్యమైనంత త్వరలో ఐపీఎల్ పై తుది నిర్ణయం తీసుకుంటామన్నాడు. ఒకవేళ ఈ ఏడాది జరగాల్సిన ఐపీఎల్‌ 13వ సీజన్‌ రద్దు అయితే.. బీసీసీఐ సుమారు రూ.4వేల కోట్లకు పైగా నష్టపోనుంది.

Next Story