తల్లుల సేవలో భక్తులు.. ఇళ్లకు కన్నాలు వేస్తున్న దొంగలు
By అంజి Published on 2 Feb 2020 11:11 AM GMTహైదరాబాద్: దొంగలు మళ్లీ నిద్ర లేచారు. మేడారం జాతరకు వెళ్తున్న వారి ఇళ్లనే టార్గెట్ చేసుకున్నారు. పగటి సమయాల్లో రెక్కీ నిర్వహిస్తున్న దొంగలు.. అర్థరాత్రి సమయాల్లో ఇళ్లను లూటీ చేస్తున్నారు.
తాజాగా అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మచ్చ బొల్లారం, కృష్ణానగర్‌లో తాళాలు వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. కృష్ణానగర్‌లో బాలయ్య అనే వ్యక్తి ఇంట్లో భారీ చోరీ జరిగింది. పెద్ద మొత్తంలో దొంగలు సొత్తును అపహరించుకుపోయారు. బాలయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి గత నెల 30వ తేదీన మేడారం సమ్మక్క సారక్క జాతరకు వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలకొట్టి చోరీకి పాల్పడ్డారని బాధితుడు వాపోయాడు. సుమారు 30 తులాల బంగారు అభరణాలతో పాటు, రూ.3 లక్షల నగదును అపహరించారని బాధితుడు బాలయ్య తెలిపాడు.
గత కొద్ది రోజులుగా నగరంలో వరుస దొంగతనాలు జరుగుతుండడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దొంగలు మాత్రం పక్కా ప్రణాళికతో ఇళ్లకు కన్నాలు పెడుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా రెండేళ్ల కొకసారి వచ్చే సమ్మక్క సారక్క జాతర సందర్భంగా ప్రజలు మేడారం బాట పడుతున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న దొంగలు రెచ్చిపోతున్నారు. మేడారం జాతరకు వెళ్లేవారు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని నగర పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. పట్టణ శివారు కాలనీల్లో సీసీ కెమెరాలు సరిగ్గా లేకపోవడంతో దొంగలకు ఇది కలిసి వస్తోంది. దొంగలు చాకచక్యంగా దొంగతనాలు చేస్తున్నారు. మేడారాని వెళ్లే వారు ముందస్తుగా తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు చెబుతున్నారు. కాగా దొంగతనాల నియంత్రణకు కొన్నేళ్ల కిందటనే పోలీస్ శాఖ 'లాక్డ్ హౌస్ మోనటరింగ్ సిస్టమ్'ను అందుబాటులోకి తెచ్చింది.0