మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు, డీసీఎం ఢీకొని ఏడుగురు మృతి చెందగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. కొల్చారం మండలం సంగాయిపేట వద్ద సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు సంగారెడ్డి జిల్లా ఫసల్‌వాడీ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.

గ్రామానికి చెందిన కొందరు మెదక్‌ జిల్లాలోని ఏడుపాయల జాతరకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా మహిళలే ఉన్నారు. డీసీఎం ముందు భాగంలో కూర్చున్న వారంతా క్యాబిన్‌లో ఇరుక్కుపోయారు. ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కాగా, క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన స్థలానికి జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి, ఎస్పీ చందన దీప్తి సందర్శించారు. ప్రమాదంపై రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.